Hyderabad | హైదరాబాద్ : కరెంట్ బిల్లు కట్టనందుకు ఓ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో ఆ ఇంటి యజమాని విద్యుత్ శాఖ సిబ్బందిపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ మీర్ చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటున్న ఉమర్ చౌదరీ.. గత కొంతకాలం నుంచి కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని చెప్పి అధికారులు కరెంట్ కట్ చేశారు. ఇక శనివారం ఉదయం ఉమర్ చౌదరీ ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది సలీంపై అతను చేయి చేసుకున్నాడు. చౌదరి తన జేబులో ఉన్న కత్తి తీసి సలీంపై దాడి చేసేందుకు యత్నించగా, అక్కడే ఉన్న మరో అధికారి అతన్ని అడ్డుకున్నాడు. దీంతో విద్యుత్ సిబ్బంది మీర్ చౌక్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఉమర్ చౌదరీపై ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.