Rangareddy | రంగారెడ్డి : మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కుమారుడు తన తల్లిని చంపేశాడు. ఈ ఘటన మంచాల మండ పరిధిలోని ఆరుట్ల గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆరుట్ల గ్రామానికి చెందిన సోమయ్య, ఎల్లమ్మ(48) దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎల్లమ్మ పెద్ద కుమారుడు శ్రీకాంత్(32) మద్యానికి బానిసగా మారాడు. అయితే మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ శుక్రవారం రాత్రి తల్లితో శ్రీకాంత్ గొడవపడ్డాడు. డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని తల్లి తెగేసి చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీకాంత్ ఇనుప రాడ్తో తల్లి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న మంచాల ఇన్స్పెక్టర్ ఏ మధు ఘటనాస్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.