మణికొండ, జూలై 2: ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథ నం ప్రకారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో నిర్మితమవుతున్న అపర్ణా జెనాన్ లేబర్ కాలనీలో పెయింటర్‌గా పనిచేస్తున్న రోషన్ (43) ఈ -114 గదిలో సహచరుడు రంజిత్కుమార్తో కలిసి ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున రోషన్ రక్తపు మడుగులో కనిపించడంతో ఆ ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సోనుకుమార్ గమనించి ఫోన్ ద్వారా అపర్ణా జేనాన్ హెచ్ఆర్ పదాల పవన్‌కుమార్‌కు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న అతను నార్సింగి పోలీసులకు తెలపడంతో పోలీసులు రక్తపు మడుగులో ఉన్న రోహన్ మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు. రోషన్ హెలా(43) మూలగ్రామం ఆసన్సోల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడిగా గుర్తించారు. అతని గొంతు భాగంలో బలమైన గాయం ఉండి, కత్తితో గాయపరచినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిపారు. ఇది కచ్చితంగా హత్య అని పోలీసులు తేల్చారు. మృతుడు ఇటీవలే కాంట్రాక్టర్ మురళీధర్ ద్వారా రంజిత్పండిత్ అనే వ్యక్తితో కలిసి పెయింటర్‌గా ఉద్యోగంలో చేరినట్టు తెలిసింది. వీరిద్దరూ రూమ్ నంబర్ E-114లో కలిసి నివసిస్తున్నారు.
కాగా ఒకే గదిలో ఉండడంతో ఇద్దరు వాదలాడుకుని ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్న తర్వాత రోషన్ గొంతులో బలమైన కత్తితో దాడి చేయడంతో రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం రంజిత్పండిత్ పరారీలో ఉండటంతో అతనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని అదేవిధంగా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అవసరమైన ఆధారాలను సేకరించినట్లు ఇన్సెక్టర్ హరికృష్ణరెడ్డి తెలిపారు. హత్య చేయడానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిని తక్షణమే పట్టుకుని మృతునికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.