మన్సూరాబాద్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, బండ్లగూడ, ఫతుల్లాగూడ శ్రీవిజయ ఎన్‌క్లేవ్‌కు చెందిన అవదానుల కృష్ణమూర్తి (37) వృత్తిరీత్య సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో పౌరోహిత్యం చేస్తుంటాడు.
కృష్ణమూర్తికి భార్య స్వాతి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కృష్ణమూర్తికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. గత కొన్ని రోజులుగా దీక్షలో ఉన్నాడు. ఇంట్లో రెండో అంతస్తులో ఒంటరిగా ఉంటున్నాడు.
కింది ఫ్లోర్లో ఉండే భార్య స్వాతితో గురువారం రాత్రి 9 గంటలకు మాట్లాడిన అనంతరం తన గదికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం 6 గంటలైన గది నుంచి బయటకు రాలేదు. కృష్ణమూర్తి బావమరిది రవితేజ రెండో అంతస్తుకు వెళ్లి డోర్ కొట్టగా ఎంతకీ ఓపెన్ చేయలేదు. డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.