Tomato | హైదరాబాద్ : తమ పిల్లల పుట్టిన రోజు వచ్చిందంటే చాలు పేరెంట్స్ హడావుడి చేసేస్తుంటారు. ఖరీదైన హోటల్స్‌లో పార్టీలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అంతే కాదు రిటర్న్ గిఫ్ట్‌లకు కూడా భారీ ఖర్చు చేసి.. అతిథులకు అందిస్తుంటారు.
కొందరైతేనేమో మానవతా దృక్పథంతో హాస్పిటల్స్‌లో, అనాథ గృహాల్లో పండ్లు పంపిణీ చేయడమో లేదంటే అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ పేరెంట్స్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ప్రస్తుతం ఆకాశాన్నంటిన ధరలతో టమాటా కొనలేని పేదల పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. తమ కూతురి పుట్టిన రోజు సందర్భంగా 400 కిలోల టమాటాలను ఉచితంగా పంపిణీ చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌కు చెందిన టీఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్ల శివ మాదిగ తన కూతురు పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించాడు. అన్నదానం, పండ్ల పంపిణీ కాకుండా.. టమాటా పండ్లను పంపిణీ చేశాడు నల్ల శివ. భారీగా పెరిగిపోయిన టమాటా ధరల పెంపును దృష్టిలో పెట్టుకుని బుధవారం 400 కిలోల టమాటాలను కొనుగోలు చేసి బస్తీలో ఉచితంగా పంపిణీ చేశారు. ఆకాశాన్నంటిన టమాటాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న జనం బారులు తీరి అందుకున్నారు.