సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేస్తుండగా బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ ఫొటో కనిపించింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. తన గురించి గొప్పగా ముచ్చట్లు చెప్పి నమ్మించాడు. క్రమక్రమంగా ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. వేరే దేశంలో ఉన్న ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమెకు పళ్లుందని, ఒక కొడుకు ఉన్నాడని చెప్పినా.. ఇండియాలో సకల సౌకర్యాలతో బతకవచ్చని చెప్పి రప్పించాడు. తాను బంగ్లాదేశ్‌లో ఉన్నానని, మీరు హైదరాబాద్‌లో ఉన్నారు.. ఎలా అంటే.. డబ్బులు పంపి హైదరాబాద్‌కు రప్పించాడు.
ఇక్కడ ఆమె పేరును మార్చి మరో పేరుతో ఆధార్ కార్డ్, ఇతర నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ సంవత్సరం గడిపాడు. అతను పరిచయమైనప్పుడు చెప్పిన ముచ్చట్లన్నీ ఫేక్ అని తెలిసి, అంతేకాకుండా అతనికి ఇదివరకే పెళ్లయిందని ,పిల్లలున్నారని తెలుసుకున్న బంగ్లా మహిళ అతనితో గొడవ పడింది. తానేదైనా ఉద్యోగం చేస్తానంటే వద్దని చెప్పి అతని సన్నిహితులు, స్నేహితులకు పడక సుఖం అందించాలని ఆమెను బలవంతపెట్టాడు.
తన జీవితాన్ని నాశనం చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆ మహిళ నిర్ణయించుకుంది.విషయం తెలుసుకున్న ఆ మోసగాడి భార్య సమస్య మరోరకంగా మారుతుందని భావించి.. బంగ్లా మహిళను సముదాయించి హైదరాబాద్ చదువుల కేంద్రానికి దగ్గరలో ఒక ఇంటికి తీసుకెళ్లి అక్కడ భార్యాభర్తలు కలిసి ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి వ్యభిచారం చేయించారు. నమ్మి వచ్చిన వ్యక్తే తనను వ్యభిచార కూపంలోకి దించుతుంటే ఏం చేయాలో పాలుపోక మొదట్లో వ్యతిరేకించినా.. తనపై ఒత్తిళ్లు పెరగడంతో తలవంచక తప్పలేదు.
ఈ విషయం చుట్టుపక్కల తెలియడంతో బంగ్లాదేశ్ మహిళ తన భర్తను ట్రాప్ చేసిందంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు బంగ్లాదేశ్ మహిళ చూపించిన ఆధారాలు, ఇతర వివరాలు చూసి ఆ మోసగాడే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అని డిసైడయి అతనిని పిలిచి కేసు పెడ్తామని చెప్పారు. ఈ విషయంలో తమను బయటపడేయమని, ఆ వ్యక్తి భార్య తనకు తెలిసిన ఒక పోలీసు అధికారిని సంప్రదించగా, ఆయన లోకల్ పీఎస్ ముఖ్యులకు మాట్లాడి సెటిల్ చేయమని రిక్వెస్ట్ చేశారు.
దీంతో ఈ వ్యవహారంపై కూపీలాగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు స్థానిక అధికారి , అతనిపై అధికారి కలిసి ఆ మోసగాడిని పిలిచి పది లక్షలకు బేరం కుదుర్చుకుని కేసు లేకుండా వెనక్కు పంపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మహిళను రెస్క్యూ హోమ్‌లో ఉంచి అక్కడి నుంచి డిపోర్టేషన్ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో బంగ్లా మహిళను హౌస్ అరెస్ట్ చేసిన విషయం, ఆమె పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంతో పాటు ఆమెను బలవంతంగా బ్రోతల్హౌస్లోకి దించి ఆ కూపాన్ని నడిపిన కేసులో దంపతులపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించినట్లు తెలిసింది.
దీంతో తమపై కేసులు కావద్దంటూ పోలీసులతో ఒక సెటిల్మెంట్కు దిగారు ఆ దంపతులు. సిటీ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్లో జరిగిన ఈ వ్యవహారంలో ఆ ప్రాంతం పోలీసులు లబ్ధ్దిపొందినా బంగ్లా మహిళకు మాత్రం ఒంటరితనమే మిగిలింది. ఏదో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చి అన్నీ కోల్పోయి తిరిగి తన దేశానికే వెళ్తున్న పరిస్థితిపై ఆ మహిళ బాధపడుతోంది. పోలీసులు ఆమెను నగరంలోని ఓ రెస్క్యూ హోమ్‌కు తరలించి కేసు ఉంటే డిపోర్టేషన్ కష్టం కాబట్టి కేసు లేకుండా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కేసును డీల్ చేసిన ఆ ప్రాంత ఇన్స్పెక్టర్పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ ప్రేమ వ్యవహారంలో పోక్సో కేసు పెడతానని బెదిరించి.. యువకుడి దగ్గర నుంచి ఒక్కరోజులోనే భారీ మొత్తంలో తీసుకుని వ్యవహారాన్ని సెటిల్ చేసినట్లు తెలిసింది. ఈ ఇన్స్పెక్టర్ను ఆ ప్రాంత ఉన్నతాధికారి నుంచి పెద్ద ఎత్తున అండదండలు ఉండడంతో ఇలాంటి కేసులను తనకు అనుకూలమైన ఎస్బీ పోలీసులతో కలిసి భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై నగర కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారు.. బాధిత మహిళకు ఏ రకంగా న్యాయం చేస్తారో చూడాలి.