ఎల్బీనగర్, జనవరి 6: మెడిసిన్ చేసి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఉన్న ఓ వ్యక్తిని ఓ కన్సెల్టెన్సీ మోసం చేసింది. దీంతో తనను మోసం చేసిన కన్సెల్టెన్సీపై ఫిర్యాదు చేసిన బాధితుడు.. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నాడు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన గోపాల కృష్ణారెడ్డి (50) ఎంబీబీఎస్ చదువాలన్న లక్ష్యంతో చైతన్యపురిలోని న్యూ వేవ్ స్టూడెంట్స్ కన్సల్టెన్సీ సంస్థను సంప్రదించాడు. కన్సల్టెన్సీ యజమాని హేమంత్‌రెడ్డి ఎంబీబీఎస్ విద్యను అభ్యసించేందుకు కర్గిస్తాన్ దేశం సరైనదని గోపాల కృష్ణారెడ్డికి తెలిపి తమ కన్సల్టెన్సీ ద్వారా కర్గిస్తాన్లోని యూన్సివర్సిటీ ఆఫ్ సౌత్ ఏసియా కాలేజీలో సీటు ఇప్పించారు.
కర్గిస్తాన్ దేశానికి వీసా, ఫ్లైట్ టిక్కెట్స్ ఇప్పించి ఆ దేశానికి గోపాలకృష్ణారెడ్డిని పంపించారు. కాగా గోపాల కృష్ణారెడ్డి మొదటి సెమిస్టర్ ఫీజు కింద రూ.3.75 లక్షలు హేమంత్‌రెడ్డికి చెల్లించారు. అయితే కాలేజీకి వెళ్లిన తర్వాత విద్యను అభ్యసించడంతో పాటుగా విద్యార్థులకు కో ఆర్డినేటర్‌గా కూడా గోపాల కృష్ణారెడ్డికి జాబ్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే తీరా కర్గిస్తాన్లోని కాలేజీకి వెళ్లాక హేమంత్‌రెడ్డికి ఇచ్చిన ఫీజును కాలేజీలో చెల్లించకుండా అక్కడ కాలేజీ ఫీజులను గోపాల కృష్ణారెడ్డి చెల్లించాలని చెప్పారు. అక్కడ రూ. 75 వేలు, అదే విధంగా మరో రూ. 80 వేలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఫీజులు తనకు భారం అవుతుందని భావించిన గోపాలకృష్ణారెడ్డి ఇండియాకు తిరిగి వచ్చేశారు.
తనను న్యూ వేవ్ స్టూడెంట్స్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసిందని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో 2025 నవంబర్ 7న ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు. కన్సల్టెన్సీ యజమాని హేమంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. కాగా ఈ కేసులో బాధితుడు మాజీ నక్సలైట్ అని సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు దృవీకరించడం లేదు. తనకే న్యాయం జరగడం లేదని బాధితుడు వాపోతున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు విషయాన్ని బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది.