కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?! ఈ ప్రశ్నకు రెండేండ్లలో సమాధానం దొరికింది. కానీ అసలు మూసీ అభివృద్ధి పరిధి ఎంత?.. అనేందుకు మాత్రం రెండున్నరేండ్లు దాటినా సమాధానం దొరకడం లేదు. చివరకు ఘనత వహించిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) అధికారులకే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టుకొని కీర్తించిన సింగపూర్ కన్సల్టెంట్ కంపెనీకి సైతం ఇది అంతుచిక్కడం లేదు. నిజం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ మేరకు వెలువడిన పత్రికా ప్రకటనలోనే ‘అసలు మూసీ ఎఫ్టీఎల్, బఫర్కు సంబంధించి స్పష్టమైన విధానాన్ని రూపొందించండి’ అని సాక్షాత్తూ సీఎం అధికారులను ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అసలు ప్రాజెక్టులో భాగంగా నదికి రెండువైపులా ఎంత పరిధిలో అభివృద్ధి చేపడతారు..? ఎంత పరిధిని పరిగణలోనికి తీసుకుంటారనే దానిపై ఏ దశలోనూ… ఏ ఒక్కరిలోనూ స్పష్టత కనిపించకపోవడంతో ఏండ్లు గడుస్తున్నా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతున్నది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై అయోమయం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అసలు అధికారంలోకి వచ్చింది మొదలు హైదరాబాద్ మహా నగరాభివృద్ధిని అటకెక్కించి కాంగ్రెస్ సర్కార్ జపిస్తున్న ఏకైక మంత్రం..మూసీ సుందరీకరణ ప్రాజెక్టు. మొదట్లో అంచనా విలువ కేవలం సర్కార్ పెద్దల ప్రకటనల్లోనే రూ.50వేల కోట్లతో ప్రారంభమై లక్షన్నర కోట్లకు ఎగబాకడంతో పాటు దిశా నిర్దేశం లేకుండా చేపట్టిన కూల్చివేతలు… చివరకు ఇటీవల వందల పేజీలతో రూపొందించిన ప్రాజెక్టు నివేదిక.
అన్నింటిలోనూ స్పష్టమైన తప్పటడుగులు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అసలు ప్రాజెక్టులో భాగంగా నదికి రెండువైపులా ఎంత పరిధిలో అభివృద్ధి చేపడతారు, ఎంత పరిధిని పరిగణలోనికి తీసుకుంటారనే దానిపై ఏ ఒక్కరిలోనూ స్పష్టత లేదు. 2024, జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. ఆపై అనేక దఫాలుగా ప్రాజెక్టు అంచనా వ్యయం, స్వరూపం మారుతూనే ఉన్నాయి. ప్రతి దశలోనూ అవి వివాదాస్పదం కావడంతో పాటు నదికి రెండువైపులా కిలోమీటరు దూరంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి.
వాస్తవానికి ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టే క్రమంలో ప్రథమంగా నిర్ధారించేది… దాని పరిధి. ఎక్కడ, ఎంత మేర చేపట్టాలనే దానిపై స్పష్టత వచ్చిన తర్వాతనే ఎలాంటి అభివృద్ధి చేయాలి, తద్వారా కలిగే ప్రయోజనాలు, అందుకయ్యే వ్యయం… ఇలా అనేక కోణాల్లో సర్వేలు, అధ్యయనాలు చేసి నివేదిక రూపొందిస్తారు. కానీ అసలు భూమిక లేకుండానే పూటకో విధానంగా మొదలైన ఈ ప్రాజెక్టుపై మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) అధికారుల తీరు కూడా అట్లనే తయారైంది. ఆదిలో నదికి రెండువైపులా కిలోమీటరు పరిధిలో ఉన్న నిర్మాణాలపై గూగుల్ మ్యాప్‌ను రూపొందించడంతో నగరవ్యాప్తంగా మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. ఆ తర్వాత ప్రాజెక్టు స్వరూపాన్ని నిర్ధ్దారించుకోకుండానే పరీవాహకంలో వందలాది పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఆపై పూటకో ప్రకటనతో ప్రజల్లో అయోమయం సృష్టిస్తూనే ఉన్నారు.
గాంధీ సరోవర్లోనూ..
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఆద్యంతం నెలకొన్న గందరగోళం మొదటి దశగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టులోనూ కొనసాగుతున్నది. సరోవర్ ప్రాజెక్టు కోసమంటూ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లో బాపూఘాట్ ఎగువన కొన్నిచోట్ల నదికి ఒకవైపు కిలోమీటరు దూరం వరకు హద్దులు నిర్ధారించిన దాఖలాలు ఉన్నాయి. ఇదేమంటే సమాధానం చెప్పే అధికారే ఉండటం లేదు. ముఖ్యంగా హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయం దిగువన కిలోమీటరు వరకు ఉన్న కాలనీలు, భూములను సైతం భూసేకరణ నోటిఫికేషన్ కింద సేకరించేందుకు నిర్ణయించారు. నదీ మార్గంలోకి వచ్చే సరికి రెండువైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌గా నిర్ధారించామని చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రాజెక్టు కోసం రూపొందించే నివేదికలోనూ ఇదేరీతిన ఉండాలి. కానీ ఇటీవల ఎంఆర్డీసీఎల్ రూపొందించిన పర్యావరణ ప్రభావిత అంచనా నివేదిక (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు)లో అసలు మూసీ పరిధిపై పేజీకో రీతిన వివరణ ఇవ్వడం గమనార్హం. ఏకంగా రూ.141 కోట్ల ప్రజాధనంతో కన్సల్టెంట్ బాధ్యతలు అప్పగించిన మెయిన్హర్ట్ సింగపూర్ కన్సల్టెంట్ కంపెనీ తయారు చేసిన ఈ నివేదికలో ఏకంగా మూడు రకాల పరిధిని పేర్కొనడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
దీంతో అసలు ఇందులో ఏ పరిధిని ప్రాజెక్టులో ప్రామాణికంగా తీసుకుంటారనేది మాత్రం వందల పేజీల నివేదికలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఈ నివేదికపై వచ్చిన అభ్యంతరాల్లోనూ పలువురు పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా ఇదే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అసలు నదికి రెండువైపులా ఎంత విస్తీర్ణాన్ని ప్రాజెక్టు అమలు ప్రాంతంగా ఎంచుకున్నారనే దానిపై స్పష్టత ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. దీంతో మూసీ సుందరీకరణతో పాటు ప్రస్తుతం మొదటి దశగా చేపడతామంటున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టులోనూ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు మూసీ, ఈసా నదులను ఏయే ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఎఫ్టీఎల్గా నిర్ధారించారు? అందుకు ఎంపిక చేసిన మధ్యస్త ప్రదేశం (సెంటర్ పాయింట్) ఏంది? ఎఫ్టీఎల్ తర్వాత ఎంత విస్తీర్ణంలో బఫర్..
ఆపై ఎంత విస్తీర్ణంలో ప్రాజెక్టు అమలు అంటే అభివృద్ధి కారిడార్‌గా ఎంచుకున్నారనే అనేక సందేహాలు ఇప్పటికీ సమాధానం లేకుండానే ఉన్నాయి. చివరకు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నిర్వాసితులతో ఏర్పాటు చేసే సమావేశాల్లోనూ ఎంఆర్డీసీఎల్, రెవిన్యూ అధికారులు ఈ సందేహాలను నివృత్తి చేయడం లేదు. అది చివరకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ ప్రశ్నార్థకంగానే తయారైంది. అందుకే అసలు ఎఫ్టీఎల్, బఫర్లపై స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది.