సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 10.5 లక్షలకు టోకరా వేశారు. నాదర్గుల్కు చెందిన బాధితుడు వృత్తిరిత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఒక మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్‌కు స్పందించిన బాధితుడు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. తాము నెల్సన్ మీడియా ఇండియా నుంచి నుంచి మాట్లాడుతున్నామని, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న తన పేరు నేహా శర్మ అంటూ ఓ యువతి మాట్లాడింది.
డిజిటల్ బూస్టింగ్ చేయడమే పార్ట్‌టైమ్ ఉద్యోగమని, ఇందులో టాస్క్లుంటాయని రోజు రూ. 1500 నుంచి రూ. 5 వేల వరకు సంపాదించవచ్చని నమ్మించింది. ఇలా మొదట సైబర్‌నేరగాళ్లు కొన్ని టాస్క్‌లు ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చారు. తరువాత పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో అర్జించవచ్చని నమ్మించారు. ఈ క్రమంలో బాధితుడు కొన్ని డబ్బులు వెచ్చించాడు. అందులో లాభం అంటూ కొన్ని తిరిగి ఇచ్చేశారు.
తరువాత దఫ దఫాలుగా రూ. 10.51 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు. ఇందులో కేవలం రూ.8,500 మాత్రం లాభంగా తిరిగి ఇచ్చారు. తనకు స్క్రీన్‌పై ఎక్కువ మొత్తంలో డబ్బులు కన్పిస్తున్నా, వాటిని విత్ డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.