హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రేమ్‌సింగ్ అనే యువకుడు నానా హంగామా సృష్టించాడు. స్థానికంగా ఉన్న ఓ యువతి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడిన ప్రేమ్‌సింగ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై ప్రేమ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని చితకబాదారు.
అమ్మాయి మెడకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల దాడిలో ప్రేమ్‌సింగ్ కూడా గాయపడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే గత కొంతకాలం నుంచి ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ప్రేమ్‌సింగ్ వేధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు స్పందించారు. యువతిపై ప్రేమ్‌సింగ్ కత్తితో దాడి చేశాడని ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. యువతి మెడ సహా మూడు చోట్ల కత్తితో గాయపరిచాడు. ప్రేమ్‌సింగ్‌ను స్థానికులు పట్టుకుని కొట్టారు. స్థానికుల దాడిలో ప్రేమ్‌సింగ్‌కు గాయాలయ్యాయి. నిందితుడు డిగ్రీ చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ రెడ్డి పేర్కొన్నారు.