సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పొద్దంతా ఎండతో వేడెక్కిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశానికి చిల్లు పడినట్లు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే సుమారు 10 సెం.మీటర్ల వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం 6:30గంటల వరకు అత్యధికంగా లంగర్‌హౌస్ ప్రాంతంలో 9.4సెం.మీ వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లిలో 7.2 సెం.మీలు, జూబ్లీహిల్స్‌లో 6.1 సెం.మీలు, విజయనగర్‌కాలనీలో 5.5 సెం.మీలు, శాస్త్రిపురంలో 5.2 సెం.మీలు, ఆసిఫ్‌నగర్‌లోని అల్లబండ, బంజారాహిల్స్, కాప్రా ప్రాంతాల్లో 5.0 సెం.మీలు, జుమ్మెరాత్‌బజార్, ఫిల్మ్‌నగర్, అల్వాల్‌లోని టెలికాంకాలనీ, ఆసిఫ్‌నగర్‌లో 4.8సెం.మీలు, నేరెడ్మెట్, సఫిల్‌గూడ, చార్మినార్‌లోని సర్దార్‌మహల్, మైలార్‌దేవ్‌పల్లి, దూద్‌బౌలి ప్రాంతాల్లో 4.3సెం.మీలు, ఖైరతాబాద్, జియాగూడ, శ్రీనగర్‌కాలనీ, ఘాన్సీబజార్, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో 3.7సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.