సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 75 మంది మందుబాబులను జైలుకు పంపినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మే 17 నుంచి 23 వరకు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 917 కేసులు నమోదయ్యాయని, ఇందులో 779 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు. బీఏసీ కౌంట్ 200కు పైగా వచ్చిన వారిలో 38 మంది ఉన్నారని, ఇద్దరు మహిళలు మద్యం సేవించి వాహనం నడుపుతుంటే కేసు పెట్టామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
సైబరాబాద్లో 252 మంది..
మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 252 మందిని సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. వీరిలో 199 మంది ద్విచక్ర వాహనదారులే ఉండగా.. 10 మంది త్రి చక్ర.. 43 మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో 35ఎంజీ/100ఎంఎల్ నుంచి 200ఎంజీ/100ఎంఎల్ మధ్య 228 మంది, 200ఎంజీ/100ఎంఎల్ నుంచి 300ఎంజీ/100ఎంఎల్ మధ్య 18 మంది, 301ఎంజీ/100ఎంఎల్ నుంచి 500ఎంజీ/100ఎంఎల్ మధ్య 6 మందికి బీఏసీ రేంజ్ ఉన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.