Hyderabad | సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై పెప్పర్ స్ప్రే కొట్టి, అతడిపై దాడి చేసి రూ. 7 లక్షలు దోచుకెళ్లిన కేరళ దోపిడీ దొంగల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. 3వ తేదీ రాత్రి హిమాయత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో బాధితుడు డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడు. ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి, బాధితుడి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి, అతడిని చితకబాది బ్యాగ్‌లో ఉన్న రూ. 7 లక్షలు తీసుకొని పరారయ్యారు. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏటీఎం వద్ద కాపుకాచి..
కేరళ కోజికోడ్(కాలికట్)కు చెందిన థన్సీఫ్ అలీ అలియాస్ థన్సీ వృత్తిరీత్యా మొబైల్ టెక్నీషియన్. ప్రస్తుతం హిమాయత్‌నగర్‌లో నివాసముంటూ గతంలో కోచిలోని వెస్ట్రన్ ఇంటీరియర్‌లో ఆఫీస్‌బాయ్‌గా పనిచేసిన కేరళకు చెందిన ముహమ్మద్ షాహద్ టీవీ, వాయనాడ్‌కు చెందిన థన్ష్హా బారిక్కల్, కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ ముహీస్ టీఎంలతో ఒక గ్యాంగ్‌ను తయారు చేశాడు. కాగా, దుబాయ్ నుంచి వచ్చే హవాల వ్యాపారులకు వచ్చే ఆదేశాలతో అప్పుడప్పుడు కొంత డబ్బును కేరళకు చెందిన వారి ఖాతాల్లో డిపాజిట్ చేస్తుంటారు. కేరళ ముఠా ఇలా ఏటీఎంల్లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చే వారి గురించి ఆరా తీసి, ఏటీఎంల దగ్గర కాపుకాచి కూర్చున్నారు. 3న బాధితుడు డబ్బు డిపాజిట్ చేసేందుకు ఏటీఎంలోకి వెళ్లగానే ముఠాలోని ఇద్దరు వ్యక్తులు వెళ్లి బాధితుడిపై దాడి చేసి డబ్బు లాక్కొని, బయట ఉన్న మరో ఇద్దరితో కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం సాయంత్రం ఈ ముఠా టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ టీమ్‌కు చెందిన ఎస్సై నవీన్‌కుమార్, దోమలగూడ పోలీసులకు పట్టుబడింది. నిందితుల నుంచి రూ. 3.25 లక్షల నగదు, పెప్పర్ స్ప్రే బాటిల్, ఒక కారు, బైక్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి ఆదేశాలు
దుబాయ్‌కి వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారిలో కేరళ నుంచే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపించాలంటే వెస్ట్రన్ యూనియన్ వంటి మనీ ట్రాన్స్ఫర్ సంస్థల ద్వారా పంపించాల్సి ఉంటుంది. అక్కడ చార్జీలు పడుతాయి. దీంతో దుబాయ్‌లో ఉండే హవాల టీమ్‌లు కేరళ, ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని గుర్తించి.. వారికి అవసరమైన డబ్బును భారత్‌లో వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడంటే అప్పుడు పంపించే విధంగా ఒప్పందాలు చేసుకుంటాయి. అయితే ఇతర సంస్థల కంటే కమీషన్లు తక్కువగా తీసుకుంటామనే ఒప్పందం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఉండే హవాల గ్యాంగ్, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఉండే తమ గ్యాంగ్‌లకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఫలాన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు అందుతాయి. అలా తమ వద్ద ఉన్న నగదు హైదరాబాద్‌లో ఉండే హవాల ఏజెంట్లు తమ సిబ్బందితో ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బు డిపాజిట్ చేయిస్తుంటారు. ఈ ఘటనలో బాధితుడు అలా ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డబ్బు డిపాజిట్ చేస్తుండగా, కేరళ ముఠా దోపిడీ చేసింది. ఇక్కడ బాధితుడు చేసిన పనినే ముఠాలోని ప్రధాన నిందితుడు గతంలో చేసిన అనుభవం ఉంది. దీంతో ఏటీఎం కేంద్రం వద్ద కాపుకాసి బాధితుడిని దోచేశారు.
తక్కువ ధరకే ఐ ఫోన్ అనగానే..
శంషాబాద్ రూరల్, జూలై 15 : తక్కువ ధరకే ఐఫోన్ అనగానే.. ఓ వ్యక్తి నమ్మి సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయాడు. శంషాబాద్ సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామ పంచాయతీ పరిధిలోని మేకలబండ తండాకు చెందిన నగేశ్ ఈనెల 11న ఇన్‌స్టాగ్రామ్‌లో 8వేలకే ఐఫోన్ అని ప్రకటన కనిపించడంతో ఫోన్ కావాలని మెసేజ్ చేశాడు. ఇదే ఆదనుగా భావించిన ఆగంతకులు మొదట 20వేల రూపాయలు ఫోన్‌పే చేయించుకున్నారు. 14న మరోసారి మరో నంబర్‌తో ఫోన్ చేసి మరో 20 వేలు దోచుకున్నారు. మరోసారి 11వేల రూపాయలు చెల్లించాలని కోరడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.