సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు తమ విధులను సామాజిక బాధ్యతతో నిర్వర్తించినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్ ధూల్‌పేట’లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 53మంది ఎక్సైజ్ ఉద్యోగులకు గురువారం ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈడీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ధూల్‌పేటలో భాగంగా ఎక్సైజ్, ఎస్టీఎఫ్ బృందాలు కష్టపడి పనిచేయడంతోనే ఆరు నెలల్లో గంజాయి అమ్మకాలను దాదాపుగా కనుమరుగు చేయగలిగామన్నారు.
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని తెలంగాణ ప్రభు త్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ బృందా లు అహర్నిశలు శ్రమించాయని, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తుదిముట్టించే వరకు సిబ్బంది, అధికారులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈడీ.. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 53మందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ, అదనపు ఎస్పీ భాస్కర్, ధూల్‌పేట ఇన్చార్జి నంద్యాల అంజిరెడ్డి, ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు, డీఎస్పీ తిరుపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.