సుల్తాన్‌బజార్, మే 21: దశాబ్దాల కాలంనాటి కోఠిలోని ఈఎస్టీ దవాఖాన మరో అరుధైన ఘనత సాధించింది. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న 500 మంది చిన్నారులకు ఏకకాలంలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు నిర్వహించి విజయవంతం చేసింది. లక్షలాది రూపాయల విలువైన వైద్యాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆదివారం కోఠిలోని ఈఎన్టీ దవాఖానలోని ఆడిటోరియంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పూర్తి చేసుకున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలిసి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్, ప్రొఫెసర్లు డాక్టర్ లోక సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్‌లు కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి చెవిటి సమస్యతో బాధపడుతున్న వారికి కాక్లియర్ ఇంప్లాంట్‌తో సాధారణంగా మాట్లాడే విధంగా చేసే సర్జికల్ ప్రక్రియ అని అన్నారు. చెవి లోపలి భాగంలో కాక్లియర్ యంత్రాన్ని అమర్చి బయటి నుంచి ప్రాసెస్ కోసం మరో యంత్రాన్ని అమర్చినట్లు తెలిపారు. రెండు యంత్రాలతో కాంటాక్ట్ ఉండటంతో పిల్లలు వినగలిగి బ్రేయిన్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పారు. దవాఖానలో ఇప్పటి వరకు 500 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు సర్జరీలు పూర్తి చేసుకున్న 99 శాతం మంది పిల్లలు సాధారన పిల్లల మాదిరిగానే స్కూల్‌కి వెళ్తున్నారని అన్నారు.
పైసా ఖర్చులేకుండా..
బాధితులకు పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా 500 సర్జరీలు నిర్వహించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ తెలిపారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి, ఈఎస్ఐ ద్వారా సర్జరీ చేశామని చెప్పారు. సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన వైద్య సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ జయ మనోహరి, డాక్టర్ హమీద్, డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.