Cyber Crime | వెంగళరావునగర్, అక్టోబర్ 25: మీ కుమారుడిని లైంగికదాడి కేసులో అరెస్ట్ చేశాం.. అతడు కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసిన నేరగాళ్లు.. పలు దఫాలుగా బాధితురాలి నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. శాతవాహన కాలనీ, నారాయణపేటకు చెందిన రబియా నాజ్నీన్ రహ్మత్‌నగర్‌లోని తమ బంధువుల వద్దకు వచ్చింది. ఈ సమయంలోనే ఆమెకు వాట్సాప్ కాల్ వచ్చింది.
మేము హైదరాబాద్ పోలీస్‌స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ కుమారుడిని లైంగికదాడి కేసులో అరెస్ట్ చేశాం.. అని చెప్పారు. తన కుమారుడితో మాట్లాడించాలని తల్లి కోరగా.. మాట్లాడే స్థితిలో లేడని.. మీ బాబు ఏడుపు వినండి.. అంటూ నలుగురి ఏడ్పులు వినిపించారు. అందులో ఉన్నది తన కుమారుడి గొంతునేని భావించింది. బాధితురాలిని కేసు పేరుతో భయపెట్టిన నేరగాళ్లు రూ.50 వేలు వసూలు చేశారు. ఇంకా డబ్బు డిమాండ్ చేయడంతో అనుమానించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును బాధితురాలు నివాసముండే నారాయణపేటకు బదిలీ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.