దుండిగల్, సెప్టెంబర్ 30 : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యంలేని పర్యావరణాన్ని నిర్మించి రేపటి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ.వివేకానంద్, నగర కమిషనర్ రోనాల్డ్ రాస్ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా రోటరీక్లబ్ ఆఫ్ మొయినాబాద్, అజియస్ ఫెడర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కూకట్పల్లి జోన్ కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఐడీపీఎల్ చౌరస్తా నుంచి సూరారం కట్టమైసమ్మ వరకు ఐదు కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గతంలో కంటే ఎక్కువ శాతం పెరిగిందన్నారు. దీని ద్వారా పర్యావరణ సమతుల్యం పెరిగి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడి పంటల దిగుబడి పెరుగుతున్నదన్నారు.
అనంతరం కమిషనర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు పెంచి నగరవాసులకు కాలుష్యంలేని పర్యావరణాన్ని కల్పించేందుకు జీహెచ్ఎంసీ బడ్జెట్ నుంచి ప్రత్యేకంగా 10శాతం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నగరంలో 600 నర్సరీలను ఏర్పాటు చేసి నగరానికి అవసరమైన మొక్కలు పెంచుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం ద్వారా ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. వాహన కాలుష్యంతోపాటు ఇతర కాలుష్యంతో ప్రజలు అనారోగ్యంపాలు కాకుండా నగరంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నామన్నారు. నగరంలో 185 చెరువుల సుందరీకరణ చేపట్టి ప్రజలకు అవసరమైన వాకింగ్ ట్రాక్, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇదే స్ఫూర్తితో రాబోయే తరాలకు కాలుష్యంలేని సమాజాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
యూబీడీ అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది 100 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటికే లక్ష్యానికి మించి మొక్కలు నాటడంతో పచ్చదనంతో విరసిల్లి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందన్నారు. నగరంలో వివిధ వినూత్న పద్ధతుల్లో మొక్కలు నాటడంతోపాటు ఫ్లైఓవర్ల కింద వర్టికల్ గార్డెన్లు ఏర్పాటు చేసి వాహనదారులకు, ప్రయాణిలకు, నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తున్నామన్నారు. అనంతరం కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ ఆఫ్ మొయినాబాద్ ప్రతినిధి అచలవాడి సీమా, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.