హైదరాబాద్: హైదరాబాద్లో (Hyderabad) దీపావళి పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా పటాకులు పేలుస్తూ సందడి చేశారు. అయితే పటాకులు పేల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చేతిలో పేలడం, కళ్లల్లో పడడంతో గాయాలపాలవుతున్నారు. ప్రతీ సంవత్సరంలానే ఈ దీపావళికి కూడా పండుగ రోజున బాంబులు కాల్చుతున్న సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ సంభవించాయి. దీంతో కంటి గాయాలతో హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు.
ఇందులో భాగంగా మెహెదీపట్నంలోని సరోజినీదేవీ కంటి హాస్పిటల్లో (Sarojini Devi Hospital) ఇప్పటివరకు 44 మంది పటాకులు పేల్చుతూ గాయపడిన వారు చికిత్స పొందారు. వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారని వైద్యులు తెలిపారు. వారందరికీ తగిన చికిత్స అందించామని, ఎవ్వరికీ శస్త్రచికిత్సలు అవకారం లేదని వెల్లడించారు. మరిన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్ధంగాగా ఉన్నామని ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు.