సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా 33 మంది ప్రముఖ ఆర్టిస్టుల నుంచి జాలువారిన చిత్రాలు ‘హెచ్యూఈ(హౌస్ ఆఫ్ యునిఫైడ్ ఎక్స్ప్రెషన్)’ పేరుతో కొలువుదీరాయి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈనెల 28 వరకు ఫిలింనగర్‌లోని స్పిరిట్ స్పేస్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ ప్రారంభించారు. మొత్తం వంద అద్భుతమైన ఆర్ట్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్‌కు క్యురేటర్‌గా అన్నపూర్ణ వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రదర్శనలో వైకుంఠం, తరణి, సుబోధ్ కేర్కర్, రాజేశ్వర్ రావు, ప్రసన్న, బీఏ రెడ్డి, సిర్కార్, పుల్కిత్, జగదీష్ వంటి సుప్రసిద్ధ సమకాలీన కళాకారుల కళాఖండాలు ఉన్నాయి. ఈ సందర్భంగా దగ్గుబాటి సురేశ్ మాట్లాడుతూ హైదరాబాద్.. కళను ఆరాధించే నగరమని కొనియాడారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు తమ ఆలోచనలను చిత్రాల రూపంలో ఆవిష్కరించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏక్చిత్ర కో ఫౌండర్ రాజ్ కుమార్ సింగ్, రాజీవ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.