సిటీబ్యూరో, డిసెంబర్ 6: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్(EUFF)-2025 హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతిక వేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. యూరోపియన్ యూనియన్ డెలిగేట్ సెకండ్ సెక్రటరీ లోరేంజో పర్రుల్లి మాట్లాడుతూ.. ‘ గత ఏడాది హైదరాబాద్లో జరిగిన వేడుకకు వచ్చిన స్పందనే మమ్మల్ని మరోసారి ఇక్కడికి తీసుకొచ్చింది.
ఈసారి 23 యూరోపియన్ సినిమాలను ప్రదర్శిస్తున్నాం. కథలు, చిత్రీకరణ పట్ల హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రేమ ప్రత్యేకం. ఇండో-యూరోపియన్ సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం.’ అని తెలిపారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మరోసారి ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు.
సారథి స్టూడియోస్ అధినేత ఎంఎస్ఆర్వీ ప్రసాద్, యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కేవీ రావు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, ఇండియన్ బ్యాక్ జోనల్ మేనేజార్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు మూడు వేదికల్లో ఈ ప్రదర్శనలు జరుగుతాయని, వివిధ వైవిధ్యమైన చిత్రాలను తిలకించే అరుదైన అవకాశం ప్రేక్షకలుకు అందిస్తున్నందకు ఆనందిస్తున్నామని యూరోపియన్ యూనియన్ ప్రతినిథులు పేర్కొన్నారు.