ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 14: ఘట్కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న ైప్లె ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం 25 దుకాణాలను కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని కొంత మంది అడ్డుకునేందుకు యత్నించటంతో కొద్దిసేపు అధికారులతో వాగ్వాదం జరిగింది. షాపులు, ఇండ్లు కోల్పోతున్న బాధితులు మొత్తం 125 మంది ఉన్నారు. అందులోని 25 మంది గతంలో రెవెన్యూ అధికారుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. మిగతా 100 మంది నిరాకరించటంతో వారి ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వం జమ చేసింది. తమకు ఇస్తున్న డబ్బులు మార్కెట్ ప్రకారం 1:3 రేషియోలో ఉండాలని సవాల్ చేస్తూ 12 మంది కోర్టును ఆశ్రయించారు.
కాగా ఇటీవల బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలకు దిగటంతో రంగంలోకి దిగిన ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి పనులను పునరుద్ధరింపజేశారు. కాగా రోడ్డు విస్తరణ జరగకపోవటం వల్ల పనులకు అంతరాయం కలగటంతో పాటు పట్టణంలోనికి జిల్లా ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మూడు రోజులుగా స్వాధీనం చేసుకునే స్థలానికి మార్కింగ్ చేశారు.
శనివారం ఉదయం నుంచి గతంలో డబ్బులు తీసుకున్న 25 మందికి చెందిన వాణిజ్య సముదాయాలను కూల్చివేస్తుండగా కొంతమంది స్వచ్ఛందంగా కూల్చివేతలు జరుపుకున్నారు. మిగతా బాధితులు తమకు పూర్తి న్యాయం జరిగిన తర్వాతనే కూల్చివేతలు జరపాలని అడ్డుకున్నారు. అనంతరం రిలే నిరాహార దీక్ష వద్దకు వెళ్లి తమకు నష్టపరిహారం ఏదని ప్రశ్నించారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కోదండరాం అతి త్వరలో సమస్యకు పరిష్కారం తీసుకువస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.