బుధవారం 27 మే 2020
Hyderabad - May 08, 2020 , 00:36:28

గ్రేటర్‌లో 12 పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో 12 పాజిటివ్‌ కేసులు

సిటీబ్యూరో: గ్రేటర్‌లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల పరంపర కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా రెండు అంకెలతో ఈ సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.  గురువారం మరో 12కేసులు నమోదయ్యాయి. 27మంది పాజిటివ్‌ బాధితులు పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేశారు. తాజాగా నమోదైన 12కేసుల్లో దక్షిణ, పశ్చిమ మండలం పరిధిలో 7కేసులు నమోదైనట్లు తెలిసింది. కాగా నమోదైన కేసుల్లో 8కేసులు గత కేసులతో సంబంధం ఉన్నవారు కాగా నాలుగు కేసులు కొత్తగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

బేగంబజార్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి

అబిడ్స్‌: బేగంబజార్‌ బేదర్‌వాడికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకింది. గత కొద్ది రోజులుగా నివాసంలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడికి వారం రోజులుగా దగ్గు, జలుబు, జ్వరం రావడంతో ఛాతి దవాఖానకు వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

బోరబండలో కిరాణ షాపు యజమానికి..

వెంగళరావునగర్‌: రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పరిధి బోరబండ హెచ్‌ఎఫ్‌నగర్‌లో కిరాణ షాపు యజమానికి (47) కరోనా పాజిటివ్‌ వచ్చింది. కిడ్నీ రోగి అయిన ఇతను జనవరి నెల నుంచే షాపు మూసేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో బంజారాహిల్స్‌లోని ప్రైవేటు దవాఖానకు వెళ్లగా కరోనా పాజిటివ్‌ రావడంతో అతన్ని గాంధీకి తరలించారు. 

సైదాబాద్‌లో కూరగాయల వ్యాపారికి..

సైదాబాద్‌: సైదాబాద్‌లోని మాధవనగర్‌ కాలనీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి (45)  దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో కింగ్‌కోఠి దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.  

చెన్నారెడ్డినగర్‌లో..

అంబర్‌పేట: చెన్నారెడ్డినగర్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఒకే కుటుంబంలో 9 మందికి సోకింది.  

పాతబస్తీలో ఒకే కుటుంబంలో నలుగురికి

చాంద్రాయణగుట్ట : జంగమ్మెట్‌ డివిజన్‌ లక్ష్మీనగర్‌ బస్తీకి చెందిన వ్యక్తికి ఈ నెల 4న కరోనా పాజిట్‌ రాగా గురువారం అతడి భార్య (35), కొడుకు (15), కూతురు (13) ముగ్గురిని కూడా ఫీవర్‌ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. 

ఫీవర్‌లో 17 కరోనా అనుమానితులు 

అంబర్‌పేట: నల్లకుంట, ఫీవర్‌ దవాఖానలో గురువారం 17 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువశాతం ఎయిర్‌ ఇండి యా ఉద్యోగులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


logo