సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): చిట్టీల పేరుతో మోసగించి దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసి, పరారైన వ్యక్తిపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…కుత్బుల్లాపూర్, చింతల్‌లోని శ్రీసాయి కాలనీకి చెందిన సీతారామయ్య, అతడి బంధువు మురళితో కలిసి స్థానికంగా చిట్ ఫండ్ నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో వివిధ రకాల చిట్టీల పేరుతో దాదాపు 200 మంది వద్ద నుంచి సుమారు రూ. 20 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు. చిట్టీ సమయం ముగిసినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు చింతల్‌లోని సీతారామయ్య ఇంటికి వచ్చి చూడగా అతడు కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
అలర్ట్ ప్లీజ్..
సిటీబ్యూరో: గ్రేటర్లో మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆదేశించారు. బుధవారం హైడ్రా కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్, సీఈయస్ఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఏదైనా సహాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ 040-21111111కు లేదా డీఆర్ఎఫ్ (హైడ్రా) కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు సంప్రదించాలని కోరారు.