SHE Teams | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వీరందరిపై క్రిమినల్ కేసులు, పెట్టీ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు.
మెట్రో రైళ్లు, మెట్రో స్టేషన్స్, బస్టాండ్లతో పాటు వర్కింగ్ ఏరియా, కాలేజీల్లో యువతులను వేధించిన వారిపై వివిధ మాధ్యమాలపై షీ టీమ్స్‌కు 229 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా షీ టీమ్స్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి, నిఘా పెట్టి ఈవ్ టీజర్స్‌ను అరెస్టు చేశారు.
పట్టుబడిన వారందరికీ ఎల్బీ నగర్ పోలీసు కమిషనర్ క్యాంపు ఆఫీస్‌లో కౌన్సెలర్లు, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ జులై 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిందన్నారు. ఇక రెండు బాల్యవివాహాలను ఆపినట్లు తెలిపారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.