సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాలో ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరారీలో ఉన్నారు. గత నెల 15వ తేదీన ఎల్బీనగర్ ఎస్ఓటీ, సరూర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 280 నకిలీ సేల్ డీడ్స్‌ను తయారు చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో మొదట ఆరుగురు ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేసిన పోలీసులు, తరువాత దఫ దఫాలుగా నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా ఇద్దరు మున్సిపల్ సిబ్బంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పాత తేదీలతో ఉన్న డాక్యుమెంట్లు ఉపయోగించి నకిలీ సేల్‌డీడ్స్, ఇతరత్రా డాక్యుమెంట్లతో పాటు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు కూడా ఈ ముఠా తయారు చేసింది. 570 నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు గుర్తించగా.. అందులో 280 నకిలీ సేల్‌డీడ్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ నకిలీ సేల్‌డీడ్స్ ఎక్కడ ఉపయోగించారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఐదు మందికి నకిలీ సేల్డీడ్స్తో సంబంధముండటంతో వారిని అరెస్ట్ చేశారు. ఆ విచారణలో ఎక్కువగా అగ్రిమెంట్ల కోసం ఉపయోగించడంతోపాటు పాత తేదీల నాటి బాండు పేపర్లపై నోటరీలు తయారు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.
ఎక్కువగా ఓల్డ్ తేదీలలో ఉన్న బాండు పేపర్లను రెంటల్ అగ్రిమెంట్స్‌కు వాడటంతో పాటు ఆయా డాక్యుమెంట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనే విషయంలో స్పష్టత రావడం లేదు. దీంతో ఈ కేసులో పోలీసులు మూలాల వరకు వెళ్తారా? మరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఈ కేసును ఇంతటితో ముగించేస్తారా?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నార్సింగి, బండ్లగూడ జాగీర్, కామారెడ్డి మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగుల నుంచి ఎక్కువ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆయా సర్టిఫికెట్లు ఎవరికి అందాయి? ఎవరెవరికి ఇచ్చారు? అనే విషయాలపై కూడా స్పష్టత లేదు. పరారీలో ఉన్న కీలకమైన ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కితేనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.