హైదరాబాద్: హైదరాబాద్లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం (Habsiguda Accident) జరిగింది. స్కూల్ పిల్లల ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లడంతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందగా, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నది. శనివారం ఉదయం హబ్సిగూడ మెట్రో స్టేషన్ వద్ద స్కూల్ ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో.. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న సాత్విక అనే విద్యార్థిని, డ్రైవర్ ఎల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో ఆటోను వెలికితీశారు. క్షతగాత్రులను నాచారంలోని ఓ ప్రవైవేటు దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సాత్విక మరణించింది. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.