సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మూసాపేటలో కూకట్పల్లి-మూసాపేటల మధ్య ఉన్న మెట్రో స్టోర్‌ను అనుకొని సుమారు 4.20 ఎకరాల స్థలాన్ని గతంలో ట్రక్ పార్కింగ్ కోసం కేటాయించారు. నగరం శరవేగంగా విస్తరించడంతో మూసాపేటలోని ఈ పార్కింగ్ స్థలంలోకి భారీ వాహనాలు వచ్చే అవకాశం లేకపోయింది. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఈ ట్రక్ పార్కింగ్‌ను పటాన్ చెరువుకు మార్చారు. దీంతో ఖాళీగా ఉన్న స్థలాన్ని పరిరక్షించడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది.
ఈ స్థలం రక్షణకు చుట్టూ కాంపౌండ్ వాల్‌తో పాటు చైన్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటుకు హెచ్ఎండీఏ అధికారులు సుమారు రూ. 53.97 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. త్వరలోనే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసి చుట్టూ ప్రహారీ, చైన్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని ఎగ్జిబిషన్లు, మేళాలు, ఫెయిర్స్ నిర్వహించేందుకు అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.