తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 14 : సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ స్ఫూర్తిదాయకమైన రచనలు చేసి పాఠకులను ఆలోచింపజేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి సాహితీవేత్తలకు సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో 2020సంవత్సరానికిగాను తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ సాహిత్యాన్ని వెలువరించిన రచయితలకు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సాహితీవేత్తలు పురస్కారాలు ఆశించకుండా సమాజ మార్పుకు తమ రచనలను అందించాలని సూచించారు.
ప్రముఖ రచయిత కుంతీపురం కౌండిన్య తిలక్ పద్య కవితారచన మహాపరిణయం, అఫ్సర్ వచన కవిత ప్రక్రియ ఇంటివైపుకుగాను, రెంటాల జయదేవ్, వడ్డె ముద్దంగుల ఎల్లన్న గేయ కవిత సబ్బండవాదం, పుప్పాల కృష్ణమూర్తి బాల సాహిత్య రచన వెన్నెల వాకిలి, జి. వెంకట కృష్ణ కథానిక ప్రక్రియలోని దేవరగట్టు, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ నవల దుల్దుమ్మ, సంగిశెట్టి శ్రీనివాస్ సాహిత్య విమర్శ గ్రంథం దుర్భిణి, అద్దేపల్లి భరత్ కుమార్ నవ్వించే నాటికలు, ఎ.ఎం అయోధ్యరెడ్డి అనువాద గ్రంథం ఏడవకు బిడ్డా, డాక్టర్ పి. భాస్కరయోగి వచన రచన ప్రక్రియ హిందువుల పండుగలు, రచయిత్రి మందవరపు హైమావతి ఉత్తమ గ్రంథం నీలి గోరింటకు గాను పురస్కారాలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆడిట్ సంచాలకులు ఎం. వెంకటేశ్వరరావు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్‌రావు,విస్తరణ సేవా విభాగం ఇంచార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.