కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 2 : కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నగరంలో అత్యంత వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కూకట్పల్లిలో జరుగుతాయి. పోటీపడి ఇక్కడ 20 ఫీట్ల ఎత్తైన బతుకమ్మలను తయారు చేయడం ప్రత్యేకతను సంతరించుకున్నది. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వేడుకలను ప్రతిరోజూ ఘనంగా జరుపుకోవడం కూకట్పల్లిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ యేడాది సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
రంగధాముని చెరువుగట్టుపై..
సద్దుల బతుకమ్మ వేడుకల కోసం రంగధాముని చెరువుగట్టుపై పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భారీ బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు రెండు క్రేన్లను అందుబాటులో ఉంచారు. చిన్న బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు కొలనును సిద్ధం చేశారు. చెరువుగట్టుపై బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలు, చెరువులో బతుకమ్మలతో తిరిగే పడవలు, చెరువుగట్టుపై కంచెను ఏర్పాటు చేశారు. ఈ యేడాది బతుకమ్మ పండుగ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న లు బతుకమ్మ పండుగ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న నేపథ్యంలో మరింత పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగమైన బతుకమ్మ ఆటాపాటలతో పాటు భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, గుజరాతీ, కెరళ నృత్యాలతో సందడి చేయనున్నారు.
వేడుకలను విజయవంతం చేయాలి
కూకట్పల్లిలో జరిగే బతుకమ్మ పండుగ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న లు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఆదివారం రంగధాముని చెరువుగట్టుపై సద్దుల బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక, బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి క్రేన్లు, కొలనును సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గంలోని ఆడపడచులంతా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.