కంటోన్మెంట్, మార్చి 24: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అక్రమ నిర్బంధం, అణచివేతలతో పాలన కొనసాగిస్తోందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే కంటోన్మెంట్ వివిధ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు మంగళవారం గృహనిర్బంధం చేశారు. ఈస్ట్ మారేడుపల్లిలో నివాసం ఉంటున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ బయటికి వెళ్లకుండా మారేడుపల్లి పోలీసులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా పాలన అని ఊదరగొట్టే ఈ ప్రభుత్వం గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులతో అణచివేస్తుందని విమర్శించారు. ఇదేనా ప్రజాపాలన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పక్కనబెట్టి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి వద్దే ఉన్న పోలీసులు ఆ తర్వాత బయటికి వెళ్లిపోయారు.
వాహినీనగర్లో నివాసం ఉంటున్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్ ఇంటికి కార్ఖాన పోలీసులు తెల్లవారుజాము నాలుగున్నరకే చేరుకుని బయట కాపలా కాశారు. ఆరు గంటల ప్రాంతంలో బయటికి వచ్చిన గజ్జెల నాగేష్‌ను పోలీసులు చుట్టుముట్టి గృహ నిర్భంధం చేశారు. కార్ఖాన సీఐ అనురాధ, ఎస్ఐలు, ఏఎస్ఐలు గజ్జెల నివాసం వద్ద మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గజ్జెల నాగేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ హయంలో విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టి మంచి ఫలితాలు సాధించారని, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారని తెలిపారు. కాని ప్రస్తుత సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యావ్యవస్థను పూర్తిగా దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ తీరుకు నిరసనగా అసెంబ్లీ ముట్టడి పిలుపునిస్తే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం పిరికిపందల చర్యగా వర్ణించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

మియాపూర్, మార్చి 24 :ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని హైదర్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు సిందం శ్రీకాంత్ అన్నారు. హామీల అమలుతోపాటు నిరుద్యోగ యువత కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని వారికి అండగా పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అక్రమ అరెస్ట్ చేయటం సిగ్గుచేటన్నారు. హైదర్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతలను పోలీసులు మంగళవారం ముందస్తు అరెస్ట్ చేసిన సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్ని నిర్భంధాలు విధించినా ప్రజల పక్షాల పోరాడుతామని చెప్పారు. అరెస్టయిన వారిలో పార్టీ నేతలు నక్క శ్రీనివాస్, వెంకటేశ్ యాదవ్, సుబ్బరాజు, కలీం, ఎంఏ ఖదీర్, సత్తార్, పప్పు, ఇమ్రాన్, దినేష్ ఉన్నారు.
మూసాపేట, మార్చి 24: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హమీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా, కూకట్పల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తూము నిఖిల్‌ను మంగళవారం కూకట్పల్లి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ…. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పెడింగ్‌లో పెట్టిందని, దీనిని ఎండగట్టడానికి నిరసనకు సిద్ధమైతే అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ అణిచివేత, నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 24 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హమీలను అమలు చేయాలని, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరమని కూకట్పల్లి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అభిలాష్‌రావు అన్నారు. మంగళవారం కూకట్‌పల్లిలోని తన ఇంటిలో అభిలాష్రావును పోలీసులు అరెస్ట్ చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎన్నికల వేలా విద్యార్థులకు ఇచ్చిన హమీలన్నింటిని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దుండిగల్, మార్చి 24: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకుడు రవికిరణ్, ఉపాధ్యక్షుడు ప్రవీన్నాయక్లను జగద్గిరిగుట్ట, దుండిగల్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆయా పీఎస్‌లకు తరలించారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్‌లతో హక్కుల సాధన పోరు ఆగబోదన్నారు.