కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
మేడ్చల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన ‘మన ఊరు- మన బడి’ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ కింద మొదటి విడుతలో ఎంపికైన 176 పాఠశాలల్లో చేయాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందించి 15 రోజుల్లో మౌలిక వసతుల కల్పన జరగాలని ఆదేశించారు. మొత్తం 12 అంశాలకు సంబంధించిన అవసరమైన ప్రతిపాదనలు ఇంజినీరింగ్ అధికారులు రూపొందించి కలెక్టర్‌కు అందజేస్తే ఆమోదం తెలిపి పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో మూడు రకాల సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు జిల్లావ్యాప్తంగా ఎంపికైన పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జిల్లాలో పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలని, ఎస్ఎంసీ చైర్మన్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామాభివృద్ధి కమిటీలు, ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఈవో విజయకుమారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగరాజు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.