సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రజలు కుటుంబ సమేతంగా తమ ఇంటిని , పరిసరాలను శుభ్రం చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం మేయర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ డెంగీ వ్యాధి నివారణ దినం సందర్భంగా మేయర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… భాగస్వామ్య పద్ధతులను ఉపయోగించడం ద్వారా వ్యాధిని నిర్మూలిద్దాం అనే నినాదంతో ప్రతి ఇంటికీ అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. దోమల నివారణకు ఇంటి లోపల, ఇంటిపై ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో దోమ లార్వా నిల్వ ఉండకుండా మూతలు బిగించి ఉండాలని తెలిపారు. ఇంటి పరిసరాల్లో రబ్బర్ టైర్లు, డ్రమ్, ప్లాస్టిక్ వస్తువులు, పూల కుండీల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. పాడైపోయిన వస్తువులు, ప్లాస్టిక్, పాలిథిన్ వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా, దోమలకు ఆవాసాలు కాకుండా తొలగించాలని సూచించారు. అలాగే పిచ్చి మొకలను తొలగించి తులసి, పుదీనా, సిట్రోనెల్లా గ్రాస్, లెమన్ గ్రాస్ పెంచడం వల్ల దోమలను నివారించవచ్చని తెలిపారు.
మురుగునీరు నిల్వ ఉండొద్దు..
ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మేయర్ పేర్కొన్నారు. దోమల నివారణకు చెరువుల్లో దోమల లార్వాను నివారించేందుకు ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. చెరువుల్లోకి గంబూసియా చేపలు వదలడం ద్వారా దోమలను అరికట్టవచ్చన్నారు. డెంగీ వ్యాధి పాజిటివ్ కేసు నమోదు అయినచో స్ప్రేయర్ ద్వారా ఇతరులకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వార్డు ఆఫీసులతో సమస్యలకు పరిష్కారం
వార్డు ఆఫీస్ల ద్వారా సమస్యలు వెంటనే పరిషారం అవుతాయని మేయర్ తెలిపారు. వార్డు ఆఫీస్లో టౌన్ ప్లానింగ్, వాటర్ వర్స్, ఎంటమాలజిస్టు, శానిటేషన్ తదితర అధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిషారానికి కృషి చేస్తారన్నారు.గ్రీన్ బంజా రా కాలనీ సీఎంటీసీలో బంజారాహిల్స్ వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మేయర్ డెంగీ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్, ఖైరతాబాద్ ఎస్ఈ రజిత, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.