సిటీబ్యూరో, జూన్ 25 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్ స్టే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు జీఎంఆర్ ఫాస్టాగ్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే వాహనదారులు జీఎంఆర్ ఓవర్ స్టే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 నిమిషాలకు మించితే.. రూ.250 నుంచి 500 వరకు తమకు తెలియకుండానే ఆటోమెటిక్‌గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ర్యాంప్స్ వద్ద టోల్‌గేట్స్ ఏర్పాటు చేసి ఎంట్రీ, ఎగ్జిట్ సమయాలను రికార్డు చేసి వాటి ఆధారంగా 8 నిమిషాలు దాటిన వాహనానికి ఫాస్టాగ్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
కాగా, జీఎంఆర్ నిబంధనలను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఎయిర్ పోర్ట్ ర్యాంపుల వద్ద రోజూ ఎదురయ్యే భారీ ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల లగేజీ నిర్వహణలో ఆలస్యం, వృద్ధులు, దివ్యాంగ ప్రయాణికులకు సహాయం చేయాల్సిన అవసరం, నెట్వర్, చెల్లింపు సమస్యలు వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ విధానం అమలు చేయడం డ్రైవర్లకు తీవ్ర అన్యాయమని యూనియన్ పేరొంది. ప్రస్తుతం 8 నిమిషాలకు మించి ర్యాంపుల వద్ద ఉన్న వాహనాలపై 250 నుంచి రూ. 500 వరకు చార్జీలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్లపై ఇది అదనపు ఆర్థిక భారం మోపడేమనని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయని, ఎయిర్పోర్ట్ ట్రిప్‌లలో తకువ ఆదాయం, ప్లాట్ ఫామ్ కంపెనీలు ఇటీవల కాలంలో చార్జీలు పెంచకపోవడం, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులతో ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాఫిక్ నిర్వహణ లోపాలు, ఆపరేషనల్ సమస్యల వల్ల కలిగే ఆలస్యాలకు డ్రైవర్లను బాధ్యులుగా చేసి జరిమానాలు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఎయిర్పోర్ట్ ర్యాంపుల వద్ద కనీసం 10-15 నిమిషాల ఉచిత డ్రాప్-ఆఫ్ సమయం కల్పించాలి.
ఓవర్ స్టే జరిమానాలను తక్షణమే సమీక్షించి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ ప్రవేశ, నిష్రమణ ర్యాంపుల వద్ద మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ, సాంకేతిక సమస్యలు లేదా చెల్లింపు ఆలస్యాల సమయంలో ఎలాంటి జరిమానాలు విధించకూడదని డిమాండ్ చేశారు. డ్రైవర్ల న్యాయమైన ఆందోళనలను ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే పరిషరించకపోతే, ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్లు ఎయిర్ పోర్ట్ ట్రిప్‌లను జూలై మొదటి వారం నుంచి బహిషరిస్తామని హెచ్చరించారు.