పరిష్కార వేదికల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
మరో ఐదు ఆదివారాలు సమావేశాలు
టార్గెట్ పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు
అబిడ్స్, ఫిబ్రవరి 24 : జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఆస్తిపన్ను పరిష్కార వేదిక కార్యక్రమానికి దరఖాస్తుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లింపులో ఏవైనా అసమానతలు ఉన్నా, నివాసం ఖాళీగా ఉన్నా వారు ఈ పరిష్కార వేదిక ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇందుకు గాను ప్రతి ఆదివారం అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులను స్వీకరించి పరిష్కారం కనుగొంటారు. ఆస్తిపన్నును గడువు లోపు ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు మరో ఐదు ఆదివారాలు ఈ ఆస్తిపన్ను పరిష్కార వేదికలు జరుగనున్నాయి. జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాస్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశాల్లో ఆస్తిపన్ను దారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని పరిష్కరించి, పరిష్కరించలేని దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాత పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు 33 దరఖాస్తులు రాగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.