హయత్నగర్, మే 3: హయత్నగర్ డిపో-1లో ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి గుండె, ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ప్రపంచ అస్తమా దినోత్సవంను పురస్కరించుకుని హయత్నగర్ ఆర్టీసీ డిపో-1లో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్డీ హార్ట్, లంగ్స్ కేర్, ఆల్కేమ్ ఫార్మ ఆధ్వర్యంలో ఉచిత గుండె, ఊపిరితిత్తుల క్యాంపు, అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘుదీప్ పళ్ల మాట్లాడుతూ.. 41 ఏండ్లు దాటిన యాభై శాతం పైగా భారతీయుల్లో అనారోగ్యమైన ఊపిరితిత్తులు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో అస్తమా బారిన పడి చనిపోతున్నా వారిలో మనదేశం మొదటి స్థానంలో ఉందని, ఇక నుంచి మత్తు పదార్థాలు, మద్యం, పొగ తాగేవారు అలవాట్లు మానుకోని నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ఆల్కేమ్ ఫార్మా కంపెనీ వారు ఊపిరితిత్తుల వ్యాధి కోసం ఎన్నో రకాల పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఇన్నో హేలర్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఇది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగ పడుతుందని సంస్థ ప్రతినిధి పృథ్వి తెలిపారు. దాదాపు 155 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేశ్ రోషన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.