Birth Chart | జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేస్తుంటారు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసమే చేస్తూనే ఉంటారు. కానీ, అప్పులు పెరిగితే ఆర్థిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఓ వ్యక్తి అప్పుల ఊభిలో చిక్కుకుపోయిన సందర్భంలో భవిష్యత్ కోసం ప్రణాళికలు, వాటిని నెరవేర్చుకోవడం కష్టతరంగా మారుతుంది. ప్రస్తుతం జీవితంలోని ఆనందాలన్నింటినీ కోల్పోతారు. అప్పులు ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితులపైనే ముడిపడి ఉంటాయి. కానీ, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పలు గ్రహాల స్థానం సైతం అప్పులు పెరిగేందుకు దోహదం చేస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి జాతకంలో ఏర్పడే ప్రత్యేక యోగాలు అతని ఆర్థిక పరిస్థితిపై సానుకూలంగా ప్రభావం చూపుతాయి. కానీ, అశుభ స్థానాల్లో ఉన్న సమయంలో రుణ సమస్యలు మొదలవుతాయి.
జాతకచక్రంలోని 6, 8, 12వ ఇళ్లు ముఖ్యంగా అప్పు, ఆర్థిక సమస్యలకు సంబంధించినవిగా పండితులు పేర్కొంటున్నారు. ప్రతికూల ప్రభావంతో ఓ వ్యక్తి జీవితంలో అప్పు పెరిగే అవకాశాలుంటాయి. ఆయా గ్రహాల స్థానాలను బట్టి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేలా చేస్తాయి. కుజుడిని రుణ కారకుడిగా చెబుతారు. కుజుడు అశుభ ప్రభావంలో ఉంటే.. లేదా జాతకంలోని ఆరు, ఎనిమిది, పన్నెండోవ ఇంట్లో సంచరిస్తే రుణ బాధలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గ్రహ సంచారంతో ఓ వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తప్పుడు నిర్ణయాలతో తీవ్రమైన రుణ సమస్యలు ఎదుర్కొంటారు.
దేవగురువు అయిన బృహస్పతిని సంపద, శ్రేయస్సు, అదృష్టానికి కారకంగా పేర్కొంటారు. బృహస్పతి అశుభ స్థానంలో ఉంటే.. ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఆదాయం పరిమితం అవుతుంది. కొత్త ఆదాయా మార్గాలు మూసుకుపోతాయి. ఖర్చులు ఇబ్బందికరంగా మారుతాయి. ఫలితంగా ఓ వ్యక్తి తన జీవితాన్ని నెట్టుకు వచ్చేందుకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారాన్ని బట్టి ఓ వ్యక్తి అప్పులు చేయడానికి కారణాలను అర్థం చేసుకోవచ్చని.. అయితే, అవసరమైన చర్యలు తీసుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయత్నాలు చేయవచ్చని పండితులు పేర్కొంటున్నారు.