Exercise | ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి జిమ్లో వ్యాయామం చేయడం లేదా ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్లు చేయాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మంచి ఫలితాలు రావాలంటే ఎక్కువసేపు వ్యాయామం చేయడం కంటే సరైన ప్రణాళిక, తగిన విశ్రాంతి, సమతుల్య ఆహారం వంటి అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కొన్ని సాధారణ అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ తీవ్రమైన వ్యాయామం చేయడం కంటే శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే అవసరం. వ్యాయామం చేసిన తర్వాత విశ్రాంతి సమయంలోనే కండరాలు కోలుకుని మరింత బలపడతాయి. అతిగా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్థాయిలు పెరిగి, బరువు తగ్గే ప్రక్రియ మందగించే అవకాశం ఉంటుంది. అందుకే వారానికి నాలుగు రోజులపాటు తీవ్రమైన వ్యాయామం చేసి, మిగిలిన రోజుల్లో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు.
బరువు తగ్గాలంటే ఎక్కువసేపు కార్డియో చేయాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి కార్డియో చేయడం కంటే రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం, అలాగే రోజువారీ నడకను అలవాటు చేసుకోవడం శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కండరాల బలాన్ని పెంచడంతోపాటు శరీర జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మహిళల్లో నెలసరి చక్రానికి అనుగుణంగా హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు శక్తి, వ్యాయామ సామర్థ్యం, కోలుకునే వేగంపై ప్రభావం చూపుతాయి. శక్తి ఎక్కువగా ఉండే దశలో కొంచెం ఎక్కువ తీవ్రతతో వ్యాయామం చేయవచ్చు. అలసట ఎక్కువగా ఉండే దశలో మాత్రం శరీరానికి ఒత్తిడి తగ్గేలా తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవడం మంచిది.
వ్యాయామంతోపాటు ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, శరీర జీవక్రియ సక్రమంగా కొనసాగేందుకు ప్రోటీన్ అవసరం. అందుకే ప్రతి భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలని, శరీర అవసరాలకు అనుగుణంగా ప్రోటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఫిట్నెస్ కోసం కేవలం ఎక్కువసేపు వ్యాయామం చేయడంపైనే ఆధారపడకుండా, సరైన విశ్రాంతి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హార్మోన్ల మార్పులకు అనుగుణంగా వ్యాయామ ప్రణాళిక, పోషకాహారం వంటి అంశాలను సమతుల్యంగా పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.