Tongue Color | ఏదైనా వ్యాధి లేదా చిన్న అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ వద్దకు వెళితే వారు ముందుగా మన నాలుక చూస్తారు. నాలుకను చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో వారు మనకు ఉన్న వ్యాధిని నిర్దారించగలుగుతారు. మనకు ఉన్న లక్షణాలతోపాటు నాలుక రంగు, వైద్య పరీక్షల వివరాలను చూసి డాక్టర్లు మనకు మందులను రాస్తారు. అయితే నాలుక అనేది అనేక విషయాలను తెలియజేస్తుంది. సరిగ్గా అర్థం చేసుకోవాలే కానీ నాలుకను చూసి మనకు ఎలాంటి వ్యాధులు వచ్చాయో మనం కూడా ఇట్టే సులభంగా గుర్తించవచ్చు. మనం తినే పలు రకాల ఆహారాలు లేదా తాగే ద్రవాల కారణంగా నాలుక కొన్ని సార్లు రంగు మారుతుంది. ఇది మామూలే. అయితే నాలుక తరచూ ఒకే రంగులో కనిపిస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే. నాలుక వివిధ రకాల రంగుల్లో తరచూ కనిపిస్తుందంటే మనకు పలు వ్యాధులు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. నాలుక రంగును బట్టి మనకు ఉన్న వ్యాధులను ఎలా గుర్తించాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యవంతమైన వ్యక్తి నాలుక పింక్ రంగులో ఉంటుంది. నాలుకపై ఎలాంటి తెల్లదనం ఉండదు. చాలా స్మూత్‌గా ఎలాంటి గీతలు, మచ్చలు లేకుండా ఉంటుంది. నాలుక ఇలా ఉందంటే మీరు ఆరోగ్యవంతులు అని అర్థం. ఇక నాలుకపై కొందరికి ఎల్లప్పుడూ తెల్లగా ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటే నాలుక తెల్లగా మారుతుంది. లుకోప్లేకియా అనే జబ్బుతో బాధపడుతున్నా, ఓరల్ లైకెన్ ప్లేనస్ అనే సమస్య ఉన్నా, నోరు, దంతాలు, చిగుళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా, నీళ్లను సరిగ్గా తాగకపోయినా, సిఫిలిస్ అనే వ్యాధి ఉన్నా, షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నా నాలుక తెల్లగా మారుతుంది.
విటమిన్ బి12 లేదా ఐరన్ లోపిస్తే అలాంటి వారి నాలుక ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే జ్వరం ఉన్నప్పుడు, కవసకి అనే వ్యాధి వస్తే, ఫుడ్ అలర్జీలు లేదా మందుల వల్ల కలిగే అలర్జీల కారణంగా, గ్లాసైటిస్ అనే సమస్య ఉన్నవారిలోనూ నాలుక ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. దంతాలు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే కొందరికి నాలుక పసుపు రంగులోనూ కనిపిస్తుంది. అలాగే నోట్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరినా, పచ్చ కామెర్ల వ్యాధి వచ్చినా, పొగాకు నమిలినా, పొగ తాగుతున్నా, పలు రకాల మందులను వాడేవారిలో నాలుక పసుపు రంగులోకి మారుతుంది.
కొందరికి నాలుక నలుపు రంగులోనూ ఉంటుంది. బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందినా, నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, పొగ తాగుతున్నా అలాంటి వారిలో నలుపు రంగు నాలుక కనిపిస్తుంది. పర్పుల్ లేదా బ్లూ కలర్ లో నాలుక కనిపిస్తుంది అంటే ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉన్నా ఇలాగే జరుతుంది. నాలుక ఈ రంగులో ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నవారిలో, జీర్ణ సమస్యలు ఉన్నవారిలో నాలుక గ్రే లేదా తెలుపు రంగులో ఉంటుంది. కనుక నాలుక రంగును బట్టి మనకు ఉండే వ్యాధులను ఇలా నిర్దారించవచ్చు. అయితే ఇందుకు గాను సొంతంగా వైద్యం చేసుకోకూడదు. కచ్చితంగా డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.