NeoCoV | ఎక్కడో చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. హమ్మయ్యా ! కొవిడ్ తగ్గిపోతుంది.. ఇక ప్రశాంతమైన జీవితం గడపొచ్చని అనుకుంటున్న ప్రతిసారి కొత్త రూపంలో విరుచుకుపడుతూనే ఉంది. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఈ అరాచకం నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న జనాలపై మరో బాంబు పేల్చారు వుహాన్ శాస్త్రవేత్తలు. కరోనా వైరస్‌ను పోలిన కొత్త రకం వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఇది కరోనా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇది గనుక విజృంభిస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు చావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వుహాన్ సైంటిస్టులు చెప్పిన ఈ విషయాన్ని ప్రపంచం మొత్తాన్ని మరోసారి భయాభ్రాంతులకు గురి చేస్తోంది.
దక్షిణాఫ్రికాలోని కొన్ని గబ్బిలాల్లో నియో కోవ్ ( NeoCoV ) అనే కొత్తరకం వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై చైనాలోని వుహాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయని రష్యా న్యూస్ ఏజెన్సీ స్ఫుత్నిక్ పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. NeoCoV కూడా కరోనావైరస్ ( SARS-CoV-2) వంటిదేనని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అంతేకాదు మధ్య ప్రాచ్య దేశాల్లో 2012-2015 కాలంలో బయటపడిన మెర్స్ కోవ్ ( MERS-CoV ) వైరస్‌కు కూడా సంబంధం ఉందని తెలిపారు.
ప్రస్తుతం NeoCoV వైరస్ జంతువుల్లో మాత్రమే వ్యాప్తి చెందుతుందని వుహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలా అని ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని.. ఇది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గబ్బిలాల్లోని యాంజియో టెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE2)ను సమర్థంగా వాడుకుని నియోకోవ్ వైరస్ మనుగడ సాధిస్తుంది. అయితే ఈ వైరస్ మనుషుల్లోని ACE2ను ఏమార్చి మనిషి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. కాకపోతే ఈ NeoCoVలోని ఒక మ్యుటేషన్ కారణంగా మనుషులకు సోకే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. వుహాన్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
SARS-CoV-2 వైరస్‌తో పోలిస్తే NeoCoV ప్రమాదకరమైనదని వుహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్‌తో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి, మరణాల రేటు కూడా అధికంగా ఉందని పేర్కొన్నారు. ఇది కరోనా వైరస్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని.. ఇది ఒక్కసారి మనుషులకు సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు, యాంటీబాడీలు కూడా ఈ NeoCoV వైరస్‌ను ఎదుర్కోలేవని స్పష్టం చేశారు.
వుహాన్ శాస్త్రవేత్తల పరిశోధనపై రష్యాకు చెందిన విక్టర్ వైరస్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ నిపుణులు కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ వైరస్ జంతువుల్లోనే ఉన్నందున ఇప్పుడే దీనిపై పూర్తి అంచనాకు రాలేమని స్పష్టం చేశారు. వుహాన్ శాస్త్రవేత్తల పరిశోధనపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఒంటరితనం వేధిస్తోందా? ఇలా చేసి చూడండి.. వెంటనే రిలాక్స్ అవుతారు..!!
కేరళలో ఒమిక్రాన్ వేవ్.. 94 శాతం కేసులు కొత్త వేరియంట్‌వే