World Hepatitis Day | కాలేయానికి వచ్చే వ్యాధి హెపటైటిస్. ఇన్ఫెక్షన్లు, ఆల్కహాల్ వంటి దురలవాట్లతో పాటు కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు, కొన్ని రకాల మందులను తీసుకోవడం వంటి కారణాలతో హెపటైటిస్ సంక్రమించవచ్చు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో ) నడుం కట్టింది. ప్రతి ఏటా జూలై 28న ప్రపంచ హెపటైటిస్ వ్యాధి అవగాహన దినం ( వరల్డ్ హెపటైటిస్ డే )నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హెపటైటిస్ ఎలా వస్తుంది? దాని లక్షణాలేంటి? ఈ వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను రెనోవా ఎన్ఐజీఎల్ హాస్పిటల్స్‌కు చెందిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లంటేషన్ సర్జన్ డాక్టర్ ఆర్వీ రాఘవేంద్రరావు వివరించారు. అవేంటో ఆయన మాటల్లోనే..
హెపటైటిస్ అనేది వైరస్ల వల్ల లివర్‌కు వచ్చే సమస్య. ఈ వైరస్‌లో ఐదు రకాలు ఉన్నాయి. అవి ఏ, బీ, సీ, డీ, ఈ. ఇవి ఎక్కువగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. మొదట మానవ శరీరంలోకి ప్రవేశించగానే కాలేయానికి చేరుకుని ఇన్ఫెక్షన్ను కలిగిస్తాయి. ఈ హెపటైటిస్‌లో ఏ, ఈ అనేవి ఒకరి నుంచి ఒకరికి కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా సంక్రమిస్తుంటాయి. సాధారణంగా ఇటువంటి హెపటైటిస్ ఇబ్బందులు ఉంటే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం, తలనొప్పి, శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 2, 3 రోజుల్లో పచ్చ కామెర్లు బయట పడతాయి. ఇది హెపటైటిస్ వైరస్ మూలంగా లివర్ కణజాలం దెబ్బతినటం వల్ల సంభవించే పరిణామం అన్న మాట. ఎల్ఎఫ్టీ వంటి బ్లడ్ టెస్ట్, సీరలాజికల్ పరీక్షల ద్వారా హెపటైటిస్ కారక వైరస్‌ను గుర్తించవచ్చు.
చాలా సందర్భాల్లో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ద్వారానే హెపటైటిస్ అదుపులోకి వస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం హెపటైటిస్ ఏ, ఈ వైరస్ల కారణంగా కాలేయానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడవచ్చు. దీనిని ఫల్మనెంట్ హెపటైటిస్ అని పిలుస్తారు. ఇటువంటి సందర్భాల్లో రోగిని ఆస్పత్రిలో చేర్చడం, ఐసీయూలో చికిత్స చేయించడం వంటివి చేయాల్సి రావచ్చు.
రెండో రకమైన హెపటైటిస్ బీ, సీ రకాలను ప్రమాదకరమైనవిగా చెప్పొచ్చు. సాధారణంగా శరీర ద్రవాల ( లాలాజలం, రక్తం ) మూలంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటాయి. ఇన్ఫెక్టెడ్ సిరంజీలు, నీడిల్స్ ద్వారా కూడా ఇవి వ్యాపించే అవకాశం ఉంది.
ఈ వైరస్ సోకిన తర్వాత చాలామందిలో ఎటువంటి లక్షణాలు బయటపడకపోవచ్చు. కొందరిలో మాత్రం తీవ్రమైన కడుపు నొప్పి, పచ్చ కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఎటువంటి వ్యాధికారక లక్షణాలు లేకపోయినప్పటికీ హెపటైటిస్ బీ, సీ ఇన్ఫెక్షన్లు మొదలైనట్లయితే.. కాలేయంలోని కణజాలాన్ని క్రమంగా శిథిల పరుస్తాయి. ఇది క్రమంగా లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. అంటే కాలేయంలోని కొంత కణజాలం నిర్జీవ స్థితికి చేరిపోయి సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ స్థితికి చేరితే బరువు తగ్గడం, పచ్చ కామెర్లు, కడుపులో నీరు చేరడం, రక్తపు వాంతులు వంటి విపరీతమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ పరీక్షలు చేస్తారు. అలాగే కాలేయం లోపాల కారణంగా వచ్చే మార్పులను గుర్తించేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్ అవసరం అవుతాయి. ఈ వైరస్‌లను సకాలంలో గుర్తిస్తే మందులతో నియంత్రించడం సాధ్యమవుతుంది.
హెపటైటిస్ ఇన్ఫెక్షన్ లివర్ క్యాన్సర్‌కు కూడా దారి తీసే అవకాశం ఉంది. సాధారణ కాలేయ క్యాన్సర్‌ను హెపటో సెల్యూలార్ క్యాన్సర్ అని అంటారు. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వారికి ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీన్ని కడుపు పైభాగంలో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు. పసిరికలు, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ప్రాథమికంగా రక్తపరీక్ష (ఏఎఫ్‌బీ), అల్ట్రా సౌండ్ పరీక్షలతో గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించినప్పుడు ఆ కణజాలాన్ని గుర్తించి, ఆపరేషన్ ద్వారా ఆ భాగాన్ని మొత్తంగా తొలగించడం మేలు. ఆపరేషన్ వీలుకాని పరిస్థితుల్లో ప్రత్యేక విధానాలైన టేస్, అబ్లేషన్ విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. వీటిలో మైక్రోవేవ్ అబ్లేషన్ చాలా మెరుగైన చికిత్స. క్యాన్సర్ మొదటి దశలో మెరుగైన చికిత్స విధానాలతో రోగిని కాపాడవచ్చు. ఒకవేళ వ్యాధి బాగా ముదిరిపోయినప్పటికీ.. అధునాతన మార్గాలను అవలంబించడం ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. తీవ్రమైన హెపటైటిస్ రోగుల్లో అవసరాన్ని బట్టి లివర్ ట్రాన్స్ప్లంటేషన్ చేయాల్సి వస్తుంది.
హెపటైటిస్ వైరస్ రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత శుభ్రత పాటించడం, కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. రక్త దానం, మార్పిడి సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెపటైటిస్ బీ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు టీకాలు కూడా లభిస్తున్నాయి.
హెపటైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం అవసరం. ముందుగానే జాగ్రత్త పడితే మందులతో లేదా సర్జికల్ విధానాలతో ట్రీట్మెంట్ అందించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత త్వరగా సమస్యను గుర్తిస్తే అంత త్వరగా చికిత్స మొదలుపెట్టవచ్చు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అధునాతన విధానాలు అవలంబిస్తే హెపటైటిస్ మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.
“Hepatitis-B | కాలేయానికి వచ్చే హెపటైటిస్-బీ వ్యాధిని ఇలా గుర్తించవచ్చు..!”