Women’s Health | మహిళల ఆరోగ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల మార్పులు, జీవనశైలి, రోజువారీ పనులు, భావోద్వేగ పరిస్థితులు వంటివి అన్నీ కలిసి శరీర సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం చాలా మంది మహిళలు మూడ్ మార్పులు, అలసట, నిద్రలో అంతరాయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతౌల్యం, జీర్ణక్రియ లోపాలు, శరీర శక్తి తగ్గుదలకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం సహజమైన పరిష్కారాలను అందిస్తుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన ప్రకారం, మహిళలు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక ఔషధ మొక్కలను చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ మూడు ముఖ్యమైన మొక్కలు హార్మోన్ల సమతౌల్యాన్ని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, మొత్తం శరీర ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. మహిళలు రోజువారి ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన మొక్కల గురించి నిపుణులు వివరిస్తున్నారు.
మహిళలు తీసుకోవాల్సిన మొక్కల్లో మొదటిది అశ్వగంధ మొక్క. ఇది శక్తివంతమైన అడాప్టోజెన్‌గా పనిచేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక కార్టిసోల్ స్థాయిలను నియంత్రించడంతోపాటు నర్వస్ సిస్టమ్‌ను సమతుల్యం చేస్తుంది. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథుల పనితీరును మెరుగుపరచడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుంది. శక్తి, ఉత్సాహం పెరగడమే కాకుండా భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా ఇది పెంపొందిస్తుంది. ఇక రెండవది శతావరి. దీనిని హెర్బ్స్ క్వీన్ అని పిలుస్తారు. మహిళల ఆరోగ్యానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. పీసీవోఎస్, వంధ్యత్వ సమస్యలు, గైనకాలజీ సమస్యలు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడటంలో, ఇన్ఫ్లమేషన్ (వాపు) తగ్గించడంలో, ఓవరీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శతావరి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే పీరియడ్స్ సమస్యలు, పీఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇక మూడవది తులసి. ప్రతి భారతీయ ఇంట్లో దొరికే ఈ ఔషధ మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసి ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సెరటోనిన్ ఉత్పత్తిని పెంచి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడం, మెటబాలిజం పెంచడం, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడం వంటి ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ఈ మూడు మొక్కలను రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా మహిళలు శరీర, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోవచ్చు. హార్మోన్ల సమతౌల్యం, మెరుగైన నిద్ర, మంచి జీర్ణక్రియ, శారీక శక్తి పెరగడం వంటివన్నీ కూడా ఈ ఔషధాలను తీసుకోవడం ద్వారా సాధ్యమవుతాయి. సహజమైన ఈ మార్గాలు మహిళల ఆరోగ్యాన్ని నెమ్మదిగా, కానీ స్థిరంగా మెరుగుపరచడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.