Dragon Fruit | ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది తమ రోజువారి ఆహారంలో భాగంగా పండ్లను తింటుంటారు. పండ్లలో మనకు అనేక రకాలు లభిస్తుంటాయి. కొన్ని ఏడాది పొడవునా లభిస్తే, మరికొన్ని పండ్లు మనకు సీజన్లలోనే అందుబాటులో ఉంటాయి. అయితే వాటిల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పండ్లను ప్రస్తుతం మన దేశంలోనూ అనేక ప్రాంతాల్లో పండిస్తున్నారు. చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఈ పండ్లు మనకు కనిపిస్తాయి. లోపలి గుజ్జు తెలుపు రంగులో చిన్నపాటి మచ్చల్లాంటి గింజలను కలిగి ఉంటుంది. ఈ పండు తియ్యగా ఉండదు. కానీ అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల మనకు అసలు ఏవైనా లాభాలు కలుగుతాయా..? అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, బీటాలెయిన్స్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. డ్రాగన్ ఫ్రూట్లో ఎరుపు రంగులో తొక్క ఉండే పండ్లు కూడా ఉంటాయి. వీటిల్లో బీటాలెయిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గిపోతాయి. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. డ్రాగన్ ఫ్రూట్లో అధికంగా ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. కనుక వర్షాకాలంలో డ్రాగన్ ఫ్రూట్‌ను కచ్చితంగా తినాల్సి ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. డ్రాగన్ ఫ్రూట్లో ఉండే ఫైబర్ కారణంగా ఈ పండ్లను తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ అధిక బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఈ పండ్లను తినడంలో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు. ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌ను రోజుకు ఒక కప్పు మోతాదులో తిన్నా చాలు, అనేక లాభాలు కలుగుతాయి.