Fatty Liver | మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మన శరీరంలో కాలేయం అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగించడం, పైత్యరసం ఉత్పత్తి చేయడం, జీవక్రియలను నియంత్రించడం, పోషకాలను నిల్వ చేయడం,రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, సమతుల్య అంతర్గత వాతావరణాన్ని కాపాడడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్నా కూడా శరీర ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. అయితే ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య కాలక్రమేణా పెరుగుతుందనే చెప్పవచ్చు. చక్కెర కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, క్యాలరీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల కాలేయ వాపుతో పాటు మరింత తీవ్రనష్టం కలిగే అవకాశం ఉంది. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆహారం పాత్ర ఎంతో ఉంది. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. ఇక ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహారాల గురించి, ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే ఇతర చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలో కొవ్వు సమస్యతో బాధపడే వారు మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెను వాడకూడదు. వేడి చేయడం వల్ల హానికారక సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ప్రాసెస్డ్, ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో అనారోగ్యకరమైన సంకలనాలు, చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేయడంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
అదే విధంగా మైదాతో తయారు చేసిన ఆహారాలు, బ్రెడ్, పేస్ట్రీస్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటు కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా కూడా చేస్తాయి. వీటితో పాటు శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా హానిని కలిగిస్తాయి. కనుక ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఈ ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. కాలేయంలో కొవ్వు సమస్యతో బాధపడే వారు ఆలివ్ నూనెను తీసుకోవాలి. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు కాలేయంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. కాలేయ పనితీరుకు మద్దతును ఇస్తాయి.
బాదం, వాల్నట్స్, చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిని తీసుకోవాలి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్, ఫైబర్ కాలేయ ఆరోగ్యానికి మద్దతును ఇస్తాయి. రోజంతా నీటిని ఎక్కువగా తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల కాలేయ పనితీరు సరిగ్గా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి. కాలేయంలో కొవ్వు సమస్యతో బాధపడే వారు ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కాలేయంలో కొవ్వు చాలా వరకు కరుగుతుంది. అధికంగా మద్యం సేవించడం మానేయాలి. దీని వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
అలాగే మనం ఇతర అనారోగ్య సమస్యలకు వాడే మందులు కూడా కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక మందులను వాడే విషయంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం. వీటితో పాటు రోజూ 6 నుండి 8 గంటలు నాణ్యమైన నిద్ర పోయేలా చూసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయి. దీంతో మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా తగిన ఆహారాలు తీసుకుంటూ చక్కటి దినచర్యను పాటించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.