Sensory Baseline Reset | ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలి, నిరంతర స్క్రీన్ వినియోగం, పని ఒత్తిడి, శబ్ద కాలుష్యం వంటి కారణాలతో చాలామంది మానసిక అలసట, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజంతా మెదడుపై పడే అధిక ఇంద్రియ ప్రేరణ (సెన్సరీ స్టిమ్యులేషన్) నాడీ వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాడీ వ్యవస్థకు విశ్రాంతి కల్పించే సెన్సరీ బేస్‌లైన్ రీసెట్ అనే సులభమైన పద్ధతి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ట్రాఫిక్ శబ్దాలు, నిరంతర మల్టీటాస్కింగ్ వంటి కారణాలతో మెదడు ఒకేసారి అధిక సమాచారాన్ని స్వీకరిస్తుంది. దీంతో శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే ఫైట్ ఆర్ ఫ్లైట్ స్థితిలోకి వెళ్లి, ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. ఫలితంగా మెదడు అలసిపోయినా విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సెన్సరీ బేస్‌లైన్ రీసెట్ ఉపయోగపడుతుంది.
సెన్సరీ బేస్‌లైన్ రీసెట్ అంటే బాహ్య ప్రేరణలను కొంతసేపు తగ్గించి మెదడును మళ్లీ ప్రశాంత స్థితికి తీసుకురావడం. ఇది నాడీ వ్యవస్థలో అధిక ఉత్తేజాన్ని తగ్గించి సహజ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. ఈ పద్ధతి మానసిక అలసటను తగ్గించడమే కాకుండా, మనసును ప్రశాంతంగా మార్చి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాడీ వ్యవస్థ అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. పని ముగిసిన తర్వాత చిరాకు రావడం, తరచూ తలనొప్పి లేదా అలసట అనిపించడం, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు పూర్తిగా అలసిపోయినప్పటికీ విశ్రాంతి తీసుకోలేకపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే సెన్సరీ రీసెట్ అవసరమని గుర్తించాలి. ఈ పద్ధతి ప్రధానంగా శరీరంలోని పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజపరుస్తుంది. దీనిని రెస్ట్ అండ్ డైజెస్ట్ వ్యవస్థగా కూడా పిలుస్తారు. ఇది ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ స్థాయిని తగ్గించి మెదడుపై పడే భారాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా మెదడు సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రాసెస్ చేయగలుగుతుంది.
రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయగల కొన్ని పద్ధతులు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. తక్కువ వెలుతురు ఉన్న గదిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు కళ్లను మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. రోజంతా జరిగిన సంఘటనలను పదేపదే గుర్తు చేసుకోవడం బదులు, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాన్ని ఊహించుకోవడం మనసును ప్రశాంతపరుస్తుంది. శబ్దాల నుంచి కొంతసేపు దూరంగా ఉండడం కూడా ప్రయోజనకరం. నిశ్శబ్ద వాతావరణంలో ఉండడం లేదా వైట్ నాయిస్ వినడం ద్వారా మెదడుపై పడే అధిక ఉత్తేజం తగ్గుతుంది. అలాగే మొబైల్ నోటిఫికేషన్లు, స్క్రీన్ల వినియోగాన్ని కొంతసేపు పూర్తిగా నిలిపివేయడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం కూడా ఒత్తిడిని తగ్గించే మంచి పద్ధతి. నాలుగు నుంచి ఆరు సెకన్ల పాటు శ్వాసను లోపలకు తీసుకుని, ఆరు నుంచి ఎనిమిది సెకన్ల పాటు నెమ్మదిగా బయటకు వదిలే శ్వాసాభ్యాసం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది.
పచ్చిక గడ్డిపై చెప్పులు లేకుండా కొంతసేపు నడవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్ధతి రక్తపోటును తగ్గించడంలో, మెదడు చురుకుదనాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఎప్పుడూ ఆందోళనలో ఉన్న భావనను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. రోజులో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు మొబైల్, కంప్యూటర్, టెలివిజన్ వంటి డిజిటల్ పరికరాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం. ఈ డిజిటల్ డిటాక్స్ వల్ల మెదడు విశ్రాంతి పొందుతుంది. నిరంతర స్క్రీన్ వినియోగం వల్ల ఏర్పడే నాడీ వ్యవస్థ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత మెరుగుపడుతుంది. సెన్సరీ రీసెట్‌ను అవసరాన్ని బట్టి తక్కువ సమయం లేదా ఎక్కువ సమయం చేయవచ్చు. ఐదు నుంచి పది నిమిషాలపాటు చేసే చిన్న విరామం కూడా ప్రయోజనాన్ని అందిస్తుంది. 20 నుంచి 30 నిమిషాలపాటు చేసే లోతైన విశ్రాంతి మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజూ ఈ అలవాటును కొనసాగిస్తే నాడీ వ్యవస్థ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం క్రమంగా పెరుగుతుంది.
పని ముగిసిన తర్వాత, నిద్రకు ముందు, ఆందోళన ఎక్కువగా ఉన్న సమయంలో లేదా మధ్యాహ్నం పనిభారం వల్ల అలసటగా అనిపించినప్పుడు ఈ పద్ధతిని పాటించవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు పనిచేసేవారు, స్క్రీన్ వినియోగం అధికంగా ఉండేవారు, ఆందోళన లేదా బర్నౌట్‌తో బాధపడేవారు, పట్టణాల్లో అధిక ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. నాడీ వ్యవస్థపై అధిక ఒత్తిడి ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారింది. అయితే ప్రతిరోజూ కొద్ది నిమిషాలు కేటాయించి సెన్సరీ బేస్‌లైన్ రీసెట్ వంటి శాస్త్రీయంగా నిరూపితమైన సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.