Navel Lint | గర్భస్థ శిశువులకు ఆహారం, ద్రవాలు అన్నీ బొడ్డు తాడు ద్వారా అందుతాయన్న విషయం తెలిసిందే. శిశువు జన్మించాక బొడ్డు తాడును కట్ చేస్తారు. దీంతో శిశువు పెరిగే కొద్దీ బొడ్డు ఆకారంలో మార్పు వస్తుంది. కొందరికి బొడ్డు పైకి వచ్చి ఉంటుంది. కొందరికి లోపలికి ఉంటుంది. అయితే బొడ్డు లోపలికి ఉన్నవారిలో అందులో ఎప్పుడూ మెత్తని పదార్థం పేరుకుపోతుంది. అది చాలా మెత్తగా, మృదువుగా పోగుల మాదిరిగా ఉంటుంది. అయితే ఆ పదార్థం ఏమిటి, అది ఎలా ఎందుకు పేరుకుపోతుంది.. అని చాలా మందికి సందేహం వస్తుంటుంది. అయితే బొడ్డులో పేరుకుపోయే ఆ పదార్థాన్ని లింట్ అంటారు. దీన్నే అంబైలికల్ లింట్ లేదా నావెల్ ఫ్లఫ్ అని కూడా పిలుస్తారు. బొడ్డు లోపలికి ఉండే వారిలో ఇది ఎక్కువగా ఏర్పడుతుంది. బొడ్డును తరచూ శుభ్రం చేసుకునే వారిలో ఇది ఏర్పడదు.
బొడ్డులో ఏర్పడే లింట్లో సాధారణంగా మృత చర్మ కణాలు, దుమ్ము, ధూళి కణాలు, మనం ధరించే లేదా కప్పుకునే వస్త్రాలకు చెందిన మెత్తని ఫైబర్, వెంట్రుకలు లేదా వెంట్రుకల కణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి మెత్తని పదార్థంగా ఏర్పడుతాయి. దీన్నే లింట్ అంటారు. అయితే లింట్ అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇది హానికరం కాదు. కానీ దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక లింట్ను శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా సున్నితంగా ఈ లింట్ను తొలగించాలి. లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. అవి సెప్టిక్కు దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా లింట్ను శుభ్రం చేసుకోవాలి.
లింట్ను శుభ్రం చేయడానికి గాను కాటన్ బడ్ను ఉపయోగించాలి. అయితే ఈ పని స్నానం చేశాక చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్నానం చేసిన తరువాత చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. అప్పుడు క్లీన్ చేస్తే లింట్ సులభంగా బయటకు వస్తుంది. ఇక స్నానం చేసిన తరువాత ఒక కాటన్ బడ్ను తీసుకుని దాన్ని సున్నితంగా బొడ్డులో పెట్టి కుడి నుంచి ఎడమ వైపుకు లేదా ఎడమ నుంచి కుడి వైపుకు సున్నితంగా తిప్పాలి. దీంతో బడ్కు లింట్ దానంతట అదే ఆటోమేటిగ్గా అతుక్కుంటుంది. తరువాత బడ్ను బయటకు తీయాలి. ఇలా లింట్ క్లీన్ అయ్యే వరకు చేయాల్సి ఉంటుంది. అయితే కాటన్ బడ్ తేమగా లేకుండా చూసుకోవాలి. పొడిగా ఉన్నది వాడాలి. లేదంటే బొడ్డులో బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
బొడ్డులో ఉండే లింట్ను క్లీన్ చేసేందుకు గాను కొబ్బరినూనె, ఆలివ్ నూనె, బేబీ ఆయిల్ వంటి నూనెలను కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా ఒక నూనెను తీసుకుని కొన్ని చుక్కలను బొడ్డులో వేయాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు వేచి ఉన్న తరువాత శుభ్రమైన వస్త్రం లేదా కాటన్ బడ్ సహాయంతో బొడ్డును తుడవాలి. దీంతో లింట్ సులభంగా బయటకు వస్తుంది. బొడ్డు శుభ్రంగా మారుతుంది. తరువాత సబ్బుతో ఆ ప్రాంతాన్ని కడిగేయాలి. దీని వల్ల ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయా చిట్కాలను పాటిస్తే బొడ్డులో ఉండే లింట్ను చాలా సులభంగా క్లీన్ చేయవచ్చు. అయితే పదునైన వస్తువులను ఇందుకు ఉపయోగించకూడదు. అలాగే గోర్లను పూర్తిగా కత్తిరించాకే ఈ పని చేయాలి. గోర్లు బాగా పెంచి బొడ్డును క్లీన్ చేయకూడదు. ఈ విధంగా లింట్ను తొలగించుకోవచ్చు.