Pulse Rate | మన నాడి రేటును బట్టి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతుల్లో ఈ హృదయ స్పందనల రేటు 55 నుండి 85 బీట్స్ వరకు ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అధికంగా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ నాడి రేటు 60 నుండి 100 బీట్స్ వరకు ఉంటుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి భావోద్వేగాలకు గురైనప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు, హార్మోన్లల్లో మార్పులు వచ్చినప్పుడు, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడినప్పుడు నాడి రేటు మారుతుంది. కొన్ని సార్లు ఈ నాడి రేటు ఎక్కువ లేదా తక్కువ అవ్వడం జరుగుతుంది. ఇది మన శరీరంలో ఉండే పెద్ద అనారోగ్య సమస్యలను, అంతర్లీనంగా ఉండే వ్యాధులను సూచిస్తాయి. కనుక తరుచూ హృదయ స్పందన రేటును గమనిస్తూ ఉండడం చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నాడి రేటు ఎవరిలో ఎంత ఉండాలి.. ఏ సమయంలో మనం వైద్యున్ని సంప్రదించాలి.. అన్న వివరాలను వారు వెల్లడిస్తున్నారు.
ఆరోగ్యకరమైన వ్యక్తులు విశ్రాంతి తీసుకుంటునప్పుడు వారి నాడిరేటు నిమిషానికి 60 నుండి 100 బీట్స్ మధ్యలో ఉంటుంది. ఇది హృదయ నాళాల చక్కని పనితీరును, చక్కని గుండె పనితీరును సూచిస్తాయి. కొన్నిసార్లు క్రీడాకారుల్లో, చురుకుగా ఉండే వారిలో ఈ నాడిరేటు 60 కంటే కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికి కూడా ఈ రేటు ఆరోగ్యకరంగానే పరిగణించబడుతుంది. ఎదిగే పిల్లల్లో జీవక్రియల వేగం ఎక్కువగా ఉంటుంది. కనుక వీరి నాడిరేటు పెద్దల కంటే ఎక్కువగానే ఉంటుంది. నవజాత శిశువుల్లో ( 0-1 నెల) 70 – 190 బిపిఎమ్, పిల్లలు ( 1 నుండి 10 సంవత్సరాలు) 80 -160 బిపిఎమ్, కౌమార దశ( 11 -17 సంవత్సరాలు) 60 నుండి 100 బిపిఎమ్ గా ఉంటుంది. పిల్లలు ఎదిగే కొద్ది వారి నాడిరేటు తగ్గుతుంది. అలాగే పెద్దలలో ఈ నాడిరేటు క్రమంగా స్థిరంగా మారుతుంది.
వ్యాయామం చేసేటప్పుడు నాడిరేటు అధికంగా ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ఆక్సిజన్ తో కూడిన రక్తం ఎక్కువగా అవసరమవుతుంది. కనుక హృదయస్పందన రేటు ఎక్కువవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు నాడిరేటు గరిష్టంగా 220 వరకు ఉంటుంది. ఇది మనం చేసే వ్యాయామాన్ని బట్టి కూడా మారుతుంది. కనుక మనం చేసే వ్యాయామాన్ని బట్టి మన నాడిరేటు గరిష్ట హృదయ స్పందన రేటులో 50 నుండి 85 శాతం మధ్యలో ఉంటుంది.
నాడిరేటును ఉదయం నిద్రలేచిన తరువాత పరీక్షించడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిమిషానికి 90 బీట్స్ కంటే ఎక్కువ నాడిరేటు ఉంటే తక్షణం వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. నాడిరేటును పరీక్షిస్తూ ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ముందుగానే మనల్ని మనం కాపాడుకోవచ్చు.