Health Tips | సాధారణంగా గుండె జబ్బులు మన జీవన విధానం మీద ఆధారపడి ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం వంటి కారణాలతో గుండె జబ్బులు సంభవించవచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు గుండె జబ్బులు రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చుట. కొందరు పిల్లలు పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతుంటారు దాన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అసలు కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ( Congenital Heart Disease ) అంటే ఏంటి.. దాని లక్షణాలు ఎలా ఉంటాయి.. దీన్ని మనం ఎలా గుర్తించవచ్చో చూద్దాం రండి.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువులో గుండె ఏర్పడే సమయంలో జరిగే కొన్ని అనర్ధాల వల్ల వచ్చేదే కంజెనిటల్ హార్ట్ డిసీజ్. వైద్య నిపుణుల ప్రకారం.. ఈ సమస్య ఉన్న పిల్లలకు గుండెలో రంధ్రాలు ఏర్పడడం, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో సమస్యలు రావడం, గుండె కవాటాల్లో సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. చాలా సందర్భాల్లో ఇది అంత తీవ్రమైన సమస్యగా అనిపించదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రలు పిల్లల్లో కంజెనిటల్ హార్ట్ డిసీజ్ లక్షణాలను ముందే గుర్తించి సమస్య తీవ్రతరం కాకముందే చికిత్స చేయించుకోవడం మంచిది. శిశువుల్లో ఈ జబ్బు రావడానికి గల కారణాలేంటి.. దాన్ని గుర్తించడం ఎలా తెలుసుకుందాం రండి..
ఈ సమస్య రావడానికి ప్రత్యేకించి ఇదే కారణం అని చెప్పలేం. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా అంతకంటే ముందు షుగర్ సమస్యతో బాధపడుతుంటే అది శిశువు గుండెపై ప్రభావం చూపిస్తుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆల్కహాల్ లేదా పొగ తాగడం వంటివి కూడా కంజెనిటల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం కావచ్చు. కొన్నిసార్లు గర్భిణులు తీసుకునే మెడిసిన్ కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో తల్లులు రుబెల్లా వ్యాధి కలిగి ఉండటం వల్ల కూడా పిల్లల్లో కంజెనిటల్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
– పిల్లల చర్మం లేదా పెదవులు నీలిరంగులోకి మారడం
– రక్త ప్రసరణలో సమస్యలు రావడం అంటే.. అసాధారణ రక్త ప్రవాహం కలుగుతుండడం
– గుండె అసాధారణంగా కొట్టుకోవడం
-అలసట, చిన్నపాటి శారీరక శ్రమకు కూడా నిరసించి పోవడం
-అధికంగా నిద్రపోవడం
-ముఖం, కాళ్లు లేదా కడుపు భాగంలో వాపు రావడం
-తినడం మరియు తాగడంలో ఇబ్బంది కలగడం
వంటి లక్షణాలు శిశువుల్లో కనబడితే తల్లిదండ్రులు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి.. తగిన చికిత్స చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా పిల్లల విషయం కాబట్టి మరింత జాగ్రత్త పడటం మేలు.