రోగ నిరోధక శక్తి మనకు ప్రకృతి సిద్ధంగానే వస్తుంది. అయితే, కాలంతోపాటు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీంతో మనలో స్వయం సిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి చిన్నపాటి ఇన్ఫెక్షన్లకే అనారోగ్యం బారినపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకప్పుడైతే ఎంత పెద్ద జ్వరం వచ్చినా ఇంటి చిట్కాలతోనే నయం చేసుకునేవాళ్లు. ఇప్పుడు మాత్రం చిన్నపాటి జలుబును కూడా తట్టుకునే పరిస్థితి లేదు. మందుబిళ్ల నోట్లో పడాల్సిందే! కారణం… మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగినంతగా లేకపోవడమే. ఈ క్రమంలో అసలు రోగ నిరోధక శక్తి అంటే ఏంటి? అది మనకు ఎలా సమకూరుతుంది? ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి? ఏ ఆహారం తీసుకోవాలి? మొదలైన విషయాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) అనేది ప్రకృతి సిద్ధంగానే సమకూరి ఉంటుంది. మన రక్తంలోని తెల్ల రక్తకణాలు శరీరానికి సైనికుల్లా పనిచేస్తాయి. ఇవి బయటి పరిసరాల నుంచి దాడిచేసే ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాను శరీరంలోకి చొరబడకుండా రక్షిస్తాయి. ఒకవేళ కొవిడ్ 19 లాంటి వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో తెల్ల రక్తకణాలు పోరాడతాయి. ఈ విధంగా పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్యను లేదా శక్తినే రోగ నిరోధక శక్తి అని పేర్కొంటారు. ఇది మనం తీసుకునే రోజువారీ ఆహారం, శారీరక శ్రమతోనే లభిస్తుంది. అలా సమకూరని వారికి మాత్రం ఔషధాల రూపంలో ఇవ్వాల్సి వస్తుంది.
రోగ నిరోధక శక్తి అనేది వర్షకాలం, శీతకాలంలో అత్యవసరం. ఎందుకంటే వానాకాలం, చలికాలంలో డెంగీ, మలేరియా, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. ఈ పవర్ లేకపోతే వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గకపోవడమే కాకుండా రోగి తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. తరచూ వ్యాధుల బారినపడాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ప్రధానంగా వేసవి నుంచి వర్షకాలానికి మారుతున్న సంధి దశలో శరీరానికి ఇమ్యూనిటీ ఎంతో అవసరం. వానాకాలంలో సాధారణంగా డెంగీ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిలో బయటినుంచి యాంటి బయాటిక్స్ అవసరం లేకుండానే ఇలాంటి జ్వరాలను శరీరం తట్టుకుంటుంది. ఇక మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రోజువారి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఒనగూరుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే విటమిన్-సి, విటమిన్-ఇ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటిలో యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరగడంలో ఎంతో దోహదపడతాయి. పల్లీలు, పిస్తాపప్పు, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వులో సరిపడా యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.
పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లిలో యాంటి ఆక్సిడెంట్లతోపాటు యాంటిబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ప్రతిరోజూ చాయ్‌లో అల్లం లేదా తులసి, పాలల్లో అయితే పసుపు వేసుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మ, స్ట్రాబెర్రీ, కర్బూజ, తర్బూజ పళ్లు తింటే శరీరానికి తగినన్ని విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఇవి కూడా రోగ నిరోధక శక్తి పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. సమతుల ఆహారానికి పెద్దపీట వేస్తూనే, ధూమపానం, మద్యపానం లాంటి దుర్వ్యసనాలను వదిలించుకోవాలి.
వర్షకాలం, చలికాలంలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు, వేసవిలో అయితే 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. వానాకాలంలో కూరగాయలు, ఆకుకూరలు శుభ్రంగా కడిగాకే వాడుకోవాలి. వర్షకాలంలో టైఫాయిడ్ సహా వివిధ వ్యాధులు రావడానికి కలుషితమైన నీరే ప్రధాన కారణం. కాబట్టి వర్ష రుతువులో బయటి ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకు దూరం పెట్టడమే ఉత్తమం. ఇక మాంసాహారులు మాంసాన్ని చక్కగా శుభ్రం చేసి బాగా ఉడికించి తినాలి. చేపల్లో విటమిన్- ఇ, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలుచేస్తాయి.
మనిషికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో నాణ్యమైన నిద్ర అంతే ప్రధానం. ప్రతిరోజూ వయసుతో నిమిత్తం లేకుండా కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. రాత్రివేళ త్వరగా పడుకుని పొద్దునే తొందరగా లేచి చేసే వ్యాయా మం మంచి ఫలితాలను ఇస్తుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. సరైన నిద్ర వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. త్వరగా లేచి వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. మన రోగ నిరోధక శక్తి తగ్గడంలో ఒత్తిడికీ పాత్ర ఉంటుంది. కాబట్టి మానసిక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ నిషాంత్‌రెడ్డి
ఎం.డి (జనరల్ మెడిసిన్), కన్సల్టెంట్ ఫిజీషియన్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్