Quit Smoking | పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. పొగ తాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయి. శరీరంపై తీవ్రమైన నెగెటివ్ ప్రభావం పడుతుంది. అనేక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. పొగ తాగడం వల్ల చాలా మంది గుండె పోటు, క్యాన్సర్తో మరణిస్తున్నారు. ఏటా వీరి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే పొగ తాగడం వల్ల తాగేవారికే కాకుండా వారి పక్కన ఉన్న వారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల్లో వ్యర్థాలు చేరి క్యాన్సర్ కు కారణం అవుతాయి. కనుక పొగ తాగడం అన్న అలవాటును మానుకోవాల్సి ఉంటుంది. అయితే పొగ తాగడాన్ని మానుకుంటే నెల రోజుల్లోనే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పొగ తాగడం మానేసిన వారిలో బీపీ గణనీయంగా తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. పొగ తాగడం మానేసిన ఏడాదిలోగా గుండె పోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పొగ తాగడం మానేసిన కొన్ని వారాల్లోగా ఊపిరితిత్తులు పూర్తిగా రికవర్ అయ్యే చాన్సులు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. దగ్గు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొగ తాగే వారిలో చాలా మందికి వాసన, రుచి సరిగ్గా తెలియవు. నాసికా రంధ్రాలు, రుచి కళికలు సరిగ్గా పనిచేయవు. కానీ పొగ తాగడం మానేసిన కొద్ది రోజులకు మళ్లీ ఎప్పటిలా అవి పని చేస్తాయి. దీంతో ఆహారం మీద దృష్టి పెడతారు. అలాగే వాసనలకు ప్రభావితం అవుతారు.
పొగ తాగడం వల్ల నోరు, ఆహార నాళం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కానీ పొగ తాగడం మానేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. శరీరంలో ఏవైనా చిన్నపాటి క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మంచి బలవర్ధకమైన ఆహారం తింటే క్యాన్సర్ కణాలను శరీరం నాశనం చేస్తుంది. దీంతో క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. పొగ తాగడం వల్ల దంతాలు, చిగుళ్లు తమ సహజసిద్ధమైన రంగును కోల్పోయి నల్లగా మారుతాయి. అలాగే నోట్లో బ్యాక్టీరియా చేరి నోటి దుర్వాసన వస్తుంది. నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పొగ తాగడం మానేస్తే ఈ సమస్యలన్నింటి నుంచి తప్పించుకోవచ్చు. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసనకు అడ్డుకట్ట వేయవచ్చు.
పొగ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. దీంతో చిన్న వయస్సులోనే వృద్ధుల్లా కనిపిస్తారు. అదే పొగ తాగడం మానేస్తే చర్మం లోపల ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. దీంతో చర్మం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. తిరిగి యవ్వనంగా మారుతారు. పొగ తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫలితంగా దగ్గు, జలుబు తరచూ వస్తుంటాయి. అయితే పొగ తాగడం మానేస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇలా పొగ తాగడం మానేసిన నెల రోజుల్లోగా మీరు అద్భుతమైన మార్పులను మీ శరీరంలో గమనించవచ్చు.