Stomach Worms | పొట్టలో పురుగులు ఏర్పడడం అనే సమస్య సాధారణంగా కొందరికి వరచూ వస్తుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. అలాగే కొందరు పెద్దలకు కూడా అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది. పొట్టలో పురుగులు ఏర్పడేందుకు పలు కారణాలు ఉంటాయి. కలుషితమైన ఆహారం తినడం లేదా నీళ్లను తాగడం, సరిగ్గా ఉడకని మాంసం తినడం, సరిగ్గా శుభ్రం చేయని పండ్లు లేదా కూరగాయలను తినడం, దుర్గంధభరితమైన ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవడం, చిన్నారులు అయితే మట్టిలో ఆడడం, మట్టిని తినడం, చేతులను లేదా కాళ్లను శుభ్రంగా కడగకపోవడం, ఇన్ఫెక్షన్లు ఉండడం వంటి కారణాల వల్ల జీర్ణాశయంలో పురుగులు ఏర్పడుతాయి. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు అవడం, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పొట్టలో పురుగుల సమస్య ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. పొట్టలో నులి పురుగుల సమస్య ఉన్నవారు వెల్లుల్లిని రోజూ తింటుంటే మేలు జరుగుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు పొట్టలో ఉండే పురుగులను నాశనం చేస్తాయి. అందువల్ల వెల్లుల్లిని పచ్చిగా తింటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే గుమ్మడికాయ విత్తనాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఈ విత్తనాల్లో కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పొట్టలోని పురుగులను నాశనం చేస్తుంది. పురుగులను సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది. కనుక గుమ్మడికాయ విత్తనాలను తింటుంటే మేలు జరుగుతుంది.
పొట్టలోని పురుగుల సమస్యకు బొప్పాయి పండ్లు కూడా ఎంతగానో పనిచేస్తాయి. ఈ పండ్లలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ వార్మ్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక క్రిములను నాశనం చేస్తుంది. బొప్పాయి పండ్లను తింటున్నా కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ సమస్యకు కొబ్బరినూనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి పొట్టలోని పురుగులను నాశనం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కొబ్బరినూనెను ఒక టీస్పూన్ మోతాదులో రాత్రి పూట నిద్రకు ముందు తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. దీని వల్ల మలబద్దకం సైతం తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
పొట్టలో ఉన్న పురుగులు తొలగిపోవాలంటే వాల్ నట్స్ కూడా పనిచేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టి తింటుంటే మేలు జరుగుతుంది. ఈ నట్స్‌లో యాంటీ పారాసైటిక్ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తింటుంటే పొట్టలోని క్రిములు నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఈ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. తృణ ధాన్యాలు, బీన్స్, కూరగాయలు, ఆకుకూరలను తినాలి. భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసాన్ని రోజుకు 2 సార్లు సేవిస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు పొట్టలోని క్రిములను నాశనం చేస్తాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పెరుగు, క్యారెట్లు, బీట్ రూట్ లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తూ ఆహారాలను తింటుంటే పొట్టలోని నులి పురుగులను తొలగించుకోవచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.